విజయవాడ బ్యూరో ప్రతినిధి : శాసనసభ ఎన్నికల్లో గెలుపు తధ్యమని పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఐదేళ్ల వైసిపి అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలందరూ సిద్ధమయ్యారన్నారు. ఈ ఎన్నికల్లోఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పశ్చిమ నియోజకవర్గం ఎన్డీయే కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పరిశీలించారు. భవానీ పురం లోని రవీంద్ర భారతి సర్ ఆర్థర్ కాటన్ నేతాజీ స్కూల్ రైతు బజార్ తదితర పోలింగ్ కేంద్రాల్లో సందర్శించి ఎన్నికల సరళిని గమనించారు. మహిళలు వృద్ధుల తాగునీటి సౌకర్యాల గురించి ఆరా తీశారు. పలువురు మహిళలు రెండు గంటలుగా పైగా ఎండలో ఉంటున్నామని క్యూ లైన్ ముందు కదలకు పోవడం తో అసౌకర్యానికి గురి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించి పోలింగ్ శాతం పెంచాలని కోరారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల అధికారులు ఓటర్ల కోసం టెంట్లను ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా తగు జాగ్రత్తలను తీసుకోవాలని సుజనా విజ్ఞప్తి చేశారు.
ఎదురుపడ్డ సుజనా – ఆసిఫ్
పోలింగ్ సరళిని పరిశీలించడానికి వచ్చిన సుజనా కు లేబర్ కాలనీ హైస్కూల్ వద్ద వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎదురుపడ్డారు సుజనా- ఆసిఫ్ తో కరచాలనం చేసి ముచ్చటించారు. పార్టీలు వేరైనా తను నా ప్రత్యర్థి మాత్రమేనని శత్రువుగా చూడనన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులను శత్రువులుగా చూసే రోజులు పోవాలన్నారు. ఆసిఫ్ సోదర సమానుడని అన్నారు. ప్రత్యర్థిని సైతం సోదరుడిగా భావించిన సుజనా వ్యక్తిత్వాన్ని పలువురు ప్రశంసించారు.
సర్ ఆర్ధర్ కాటన్ స్కూల్ వద్ద పోలింగ్ కేంద్రాల సరళిని సుజనా చౌదరి పరిశీలిస్తున్న సమయంలో ఇండిపెండెంట్ అభ్యర్థి వైసీపీ మద్దతుదారుడు షేక్ గయాజుద్దీన్ ఐజా ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల వాతావరణంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నించాడు. పోలీసులు రంగ ప్రవేశం చేశాక వెనుతిరిగాడు.
యువత ఓటు వేయటానికి పోటీపడ్డారు. మహిళలు వృద్ధులు బారులు తీరి సంయమనం పాటించి ఓటు హక్కును వినియోగించుకున్నారు.