5 అంశాలను లేఖలో ప్రస్తావించిన వైసీపీ
వెలగపూడి ప్రత్యేక ప్రతినిధి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల బహిరంగ సభలలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. ఈమేరకు గురువారం వెలగపూడి సచివాలయం నందు అడిషనల్ సీఈవో హరీంద్ర ప్రసాద్ ను కలిసి ఫిర్యాదునందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి కూటమి నేతలు మరీ సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని మల్లాది విష్ణు ఆరోపించారు. ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పట్ల అనుచితంగా మాట్లాడుతూ.. ఆయనను మానసికంగా కుంగదీసేందుకు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం అర్రులు చాస్తూ నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాలనలో ప్రజల మన్ననలు అందుకున్న ముఖ్యమంత్రిని పట్టుకుని గూండా, నయవంచకుడు, దోపిడీదారుడు అంటూ పెందుర్తి సభలో జనసేన అధినేత మాట్లాడటంపై తీవ్రంగా స్పందించారు. రాజకీయాలలో విమర్శలు, ప్రతివిమర్శలు హుందాగా ఉండాలి తప్ప వ్యక్తిత్వ హననం ఏమాత్రం సరికాదన్నారు. 2019 తర్వాత జరిగిన ప్రతిఒక్క ఎన్నికలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మ్రోగించడంతో.. కూటమి నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారని మల్లాది విష్ణు ఆరోపించారు. సిగ్గు, రోషం లేదని ప్రజలను కించపరిచేలా గుంటూరు సభలో టీడీపీ అధినేత మాట్లాడటం తీవ్ర ఆక్షేపణీయమన్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ ఇదే విధంగా విజయవాడ ప్రజలను బాబు కించపరిచారని గుర్తుచేశారు. ఆ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అఖండ మెజార్టీ అందించి టీడీపీకి గట్టిగా బుద్ధి చెప్పినా.. బాబు తీరు మాత్రం మారలేదన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రజానీకానికి బాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ‘ఐ టీడీపీ’ వెబ్ సైట్ ద్వారా ముఖ్యమంత్రిపై విషం చిమ్ముతున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు. సీఎం జగన్ ను కించపరుస్తూ చేస్తున్న తప్పుడు పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ ను కోరినట్లు తెలిపారు. మరోవైపు ఫోన్ పే, గూగుల్ పేల ద్వారా ఓటర్లను ప్రభావితం చేస్తున్న తెలుగుదేశంపై చర్యలు తీసుకోవాలని.. టీడీపీ అకౌంట్లపై నిఘా ఉంచవలసిందిగా ఈసీకి కోరినట్లు చెప్పారు. ఇప్పటివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందించిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లాలని కోరినట్లు తెలియజేశారు. వ్యవస్థలను తప్పుబట్టడం తెలుగుదేశంకి షరామామూలైందని మల్లాది విష్ణు అన్నారు. వాహనాలలో మనీ తరలిస్తున్నారంటూ పోలీస్ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడటం తెలుగుదేశం నాయకులకు తగదన్నారు. ఇప్పటికే చీఫ్ సెక్రటరీ, డీజీపీ సహా ఉద్యోగ సంఘాలపై బురదచల్లి ప్రజాక్షేత్రంలో కూటమి నేతలు అభాసుపాలయ్యారని.. అయినా తీరు మారలేదన్నారు. మరోవైపు తెలుగుదేశం, నిమ్మగడ్డ రమేష్ కుట్రల వల్ల రాష్ట్రంలో 64 లక్షల మంది పింఛన్ దారులు ఇంటి వద్దనే పింఛన్ అందుకునే భాగ్యానికి దూరమయ్యారని మల్లాది విష్ణు ఆరోపించారు. ఆవేదనతో ఇవాళ కూడా కొందరు అవ్వాతాతలు ప్రాణాలు కోల్పోయారని, దీనికి చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది కేంద్రం
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకువచ్చింది కేంద్రం అని, చంద్రబాబు ప్రశ్నించాలనుకుంటే బీజేపీని ప్రశ్నించాలని మల్లాది విష్ణు అన్నారు. అంతేగానీ జగన్ గ్రాబింగ్ యాక్టు అంటూ ఏవిధంగా మాట్లాడతారని ప్రశ్నించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా తప్పుడు సంకేతాలు పంపుతున్న ‘లియో’ యూట్యూబ్ ఛానల్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవలసిందిగా ఈసీని కోరినట్లు తెలిపారు. అలాగే యాక్టును తీసుకొచ్చిన కేంద్రం గూర్చి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదో టీడీపీ, జనసేన నాయకులు సమాధానం చెప్పాలన్నారు. ఆ చట్టం ఏపీలో అమలు కావడం లేదని.. కానీ కుట్రపూరితంగా వైసీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. పైగా అమలులో లేని చట్టాన్ని రద్దు చేస్తూ రెండో సంతకం చేస్తామంటూ నిస్సిగ్గుగా చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఆ అంశం కోర్టు పరిధిలో ఉందని.. కనుక అమలులో లేని చట్టాన్ని బూచిగా చూపడం ఏమాత్రం సరికాదన్నారు. కేంద్రం నుంచి రావలసిన అంశాలు అనేకం ఉండగా.. ఏ ఒక్కటీ మేనిఫెస్టోలో ఎందుకు పొందుపరచలేదో..? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికలతో కూటమికి ఓటమి తప్పదని.. ప్రజల చల్లని దీవెనలతో 175 స్థానాలలో వైసీపీ విజయదుందుభి మ్రోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట నవరత్నాలు కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, వైసీపీ లీగల్ సెల్ సభ్యులు శ్రీనివాసరెడ్డి ఉన్నారు.