ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా
24 గంటల్లో సమస్యలకు శాశ్వత పరిష్కారం
ఎన్నికల ప్రచారంలో సుజనా చౌదరి
విజయవాడ నుంచి ప్రత్యేక ప్రతినిధి : అనేక దశాబ్దాలుగా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేస్తున్నామని, ఇందులో పొందుపరిచిన హామీలన్నీ నూటికి నూరు శాతం అమలు చేస్తామని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో మంగళవారం 45వ డివిజన్ లోని సితార రోటరీ నగర్, బ్రహ్మయ్య వీధి, రాజు గారి ఫ్లాట్లు, కబేళ తదితర ప్రాంతాల్లో సుజనా చౌదరి పర్యటించారు. సుజనా చౌదరికి స్థానికులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. అందరి సమస్యలను సుజనా ఓపిగ్గా విన్నారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా అనేక సమస్యలు దర్శనమిస్తున్నాయని, చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో తయారుచేసి 100% అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు పారిశ్రామికంగా అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఆదాయ మార్గాలను పెంచే విధంగా కృషి చేస్తానన్నారు. అన్ని పార్టీలను గౌరవిస్తానని, ప్రత్యర్థుల మనసులు గెలిచి పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ పెద్ద కొడుకుగా అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు. ఏపీలోనే విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రతి డివిజన్ లో ఎంపీ, ఎమ్మెల్యే కార్యాలయాలను ప్రారంభించి 24 గంటల్లో సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే విధంగా చర్యలను తీసుకుంటానన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ కుల మతాలకతీతంగా విజ్ఞతతో ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల సమస్యలను పరిష్కరిస్తామని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే సత్తా సుజనా చౌదరికి మాత్రమే ఉందన్నారు. నియోజవర్గ ప్రజలందరూ భారీ మెజారిటీతో సుజనాను గెలిపించాలని కోరారు.
సుజనాకు మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్మెస్ బేగ్ ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ సీనియర్ నాయకుడు పైలా సోమినాయుడు, రౌతు రమ్యప్రియ, లింగాల అనిల్ కుమార్, 45వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు బీరం సత్యనారాయణ, బీజేపీ డివిజన్ అధ్యక్షురాలు చల్లా రమాదేవి, జనసేన డివిజన్ అధ్యక్షురాలు గొమ్ము గోవింద లక్ష్మి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.