బేతంచెర్లలో ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
డోన్, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల్లో పోలింగ్ కేంద్రాల పరిశీలన
పోలింగ్ ప్రశాంతం..అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు
డోన్, నంద్యాల జిల్లా : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తన ఓటు హక్కును బేతంచెర్లలో వినియోగించుకున్నారు. బేతంచెర్ల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉన్న 271/141 బూత్ లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం ఉదయాన్నే క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి వెళ్లి బేతంచెర్ల పట్టణం సహా మండలంలోని రుద్రవరం,మండ్లవానిపల్లె, వెంబాయి, పెండేకల్ తదితర గ్రామాల్లో పోలింగ్ సరళిని ఆయన పరిశీలించారు. అనంతరం వచ్చి ఇంటికి సమీపంలోని పాఠశాలలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం బేతంచెర్లలోని హెచ్. కొట్టాల గ్రామంలో పోలింగ్ బూత్ ను పరిశీలించారు. ఆ తర్వాత డోన్ మండలంలోని చిన్నమల్కాపురం, డోన్ పట్టణంలోని పలు వార్డులలో జరిగిన పోలింగ్ ను మంత్రి బుగ్గన పరిశీలించారు. ప్యాపిలి పట్టణం, జలదుర్గం గ్రామంలో కూడా మంత్రి బుగ్గన పోలింగ్ తీరును పరిశీలించారు. పలుచోట్ల అధికారులను ఓటింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ బూత్ లలో సౌకర్యాలు ఉన్నాయా లేదా అనే విషయాలు ఆరా తీశారు.డోన్ లో పార్లమెంట్,అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలలో బారులు తీరడం శుభపరిణామమన్నారు. ఎన్నికల రోజు ఓటు వేయడానికి వచ్చిన ప్రజలకు, స్వేచ్ఛగా ఓటేసేందుకు తోడ్పడిన పోలీసులు, ఎన్నికల సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. డోన్ నియోజకవర్గ వ్యాప్తంగా 80 శాతం పైగా పోలింగ్ జరగడం పట్ల మంత్రి బుగ్గన హర్షం వ్యక్తం చేశారు. ప్రజల మద్దతుతో మంత్రి బుగ్గన తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.