ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
అయోధ్యకు ప్రత్యేక రైలు ప్రారంభం
హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి
గుంటూరు : చంద్రబాబు ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారో మాకు తెలియదని, పొత్తుల వ్యవహారం బీజేపీ అగ్రనాయకత్వం చూసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. బుధవారం గుంటూరు రైల్వేస్టేషన్లో అయోధ్యకు రామభక్తుల కోసం ప్రత్యేకంగా బయలుదేరిన రైలును ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇస్తూ చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారనేది మీడియా చెబుతుంటే చూస్తున్నామని పేర్కొన్నారు. ఎప్పుడు, ఎవరితో భేటీ అవ్వాలో, పొత్తులు ఎవరితో పెట్టుకోవాలో తమ అగ్రనాయకత్వం చూసుకుంటుందని చెప్పారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జరిగే వ్యవహారాల పై మాకు అవగాహన ఉండదన్నారు. అలాంటి విషయాలపై స్పందించడం సరికాదని, కొన్ని పరిమితులు ఉంటాయాని వెల్లడించారు. రాష్ట్రంలో ఏం జరగబోతుందో మీరే చూస్తారని, తినబోతూ రుచి అడగవద్దని చెప్పారు. జరుగుతున్న ప్రచారాలు చూస్తే మూడు నాలుగు రోజుల్లో పూర్తి క్లారిటీ వస్తుందన్నారు. రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ప్రజా కంటక పాలన అంతం అవ్వాలి, ఆ నినాదంతోనే రాష్ట్ర బీజేపీ నాయకత్వం పనిచేస్తుందని తెలిపారు. షర్మిలకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ముందు ప్రత్యేక హోదా అంటే ఏంటో తెలుసుకొని మాట్లాడాలని చెప్పారు. ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో ఎందుకు చేర్చలేదో ఆమె ఉండే పార్టీ నే అడగాలని తెలిపారు.
అయోధ్యకు ప్రత్యేక రైలు ప్రారంభం : అయోధ్యలోని బాలరాముని ఆలయం దర్శనార్థం గుంటూరు నుంచి రామభక్తులతో బయల్దేరిన అయోధ్య ప్రత్యేక రైలును బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి వై.సత్య కుమార్, శివస్వామిజీ జెండా ఊపి ప్రారంభించారు. పురందేశ్వరి మాట్లాడుతూ ఏపీ నుంచి అయోధ్యకు వెళ్తున్న తొలి రైలు అని చెప్పారు. భక్తులు బాలరాముని దర్శనం కోసం వెళుతుంటే చూడాలని మాత్రమే వచ్చానన్నారు. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో ప్రతిష్ట జరగడం చూస్తే ఆనందంగా ఉందని తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు పునర్వైభవం సంతరించుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ త్యాగ ఫలితమేనని వెల్లడించారు. శ్రీరాముని చల్లని చూపు ఏపీపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్, రాష్ట్ర ఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చందు సాంబశివరావు, ఉప్పలపాటి శ్రీనివాసరాజు, రామకృష్ణారెడ్డి, జూపూడి రంగరాజు, యడ్లపాటి స్వరూపరాణి, శనక్కాయల అరుణ, భీమినేని చంద్రశేఖర్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డురి శ్రీరామ్, జితేంద్రగుప్త, వెలగలేటి గంగాధర్, చెరుకూరి తిరుపతిరావు, వైవీ సుబ్బారావు పాల్గొన్నారు.