విశ్వనగరంగా ఎదిగేందుకు అన్ని అవకాశాలు ఉన్న నగరం హైదరాబాద్.
తెలంగాణ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : ఐటీ కారిడార్‌ను బాహ్యవలయ రహదారి (ఓఆర్ఆర్)తో అనుసంధానం చేస్తూ
నిర్మించిన శిల్పా లేఅవుట్ మొదటి దశ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్
ప్రారంభించారు. ఐకియా మాల్ వెనక మొదలయ్యే ఈ ఫ్లైఓవర్ 30 అంతస్తుల ఎత్తైన
భవనాల మధ్య నుంచి విశాలమైన ఓఆర్ఆర్పైకి చేరుతుంది. 2.8 కి.మీ. పొడవు.. 16
మీటర్ల వెడల్పుతో దాదాపు రూ. 250 కోట్ల వ్యయంతో శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్
నిర్మాణం పూర్తి చేశారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ఉన్న షేక్‌పేట
ఫ్లైఓవర్‌తో సమానంగా ఇది కూడా నగరంలోనే రెండో పొడవైన ఫ్లైఓవర్‌గా నిలిచింది. ఈ
సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ‘‘సీఎం
కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టిందే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్
ప్రోగ్రామ్ (ఎస్ఆర్డీపీ). ఈ ప్రాజెక్టు ఆయన మానస పుత్రిక. విశ్వనగరంగా
ఎదిగేందుకు అన్ని అవకాశాలు ఉన్న నగరం హైదరాబాద్. అన్ని రంగాల్లో
దూసుకుపోతున్న హైదరాబాద్ భవిష్యత్ అవసరాలు, మౌలిక వసతులు, ఇలా అన్ని అంశాలను
దృష్టిలో పెట్టుకొని సరైన ప్రణాళికలు ఉండాలనే ఉద్దేశంతోనే ఎస్ఆర్డీపీ
కార్యక్రమాన్ని రూపొందించి జీహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖకు సీఎం అప్పగించారు.
దీనిలో భాగంగా చేపట్టిన 48 ప్రాజెక్టుల్లో ఈ ఫ్లైఓవర్‌తో కలిపి ఇప్పటివరకు
ఆరేళ్లలో 33 ప్రాజెక్టులను పూర్తి చేశాం.
హైదరాబాద్‌లో ఎంతో అత్యుత్తమంగా ఉన్నటువంటి మౌలిక వసతులు, దేశంలో మరే
రాష్ట్రంలో లేవని మనం గర్వంగా చెప్పుకొనే విధంగా నగరాన్ని
తీర్చిదిద్దుతున్నాం. నగరం, ఐటీ సంస్థలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఏటా
వేల సంఖ్యలో ప్రజలు రాజధానికి తరలి వస్తున్నారు. అన్ని వైపులా నగరం వేగంగా
విస్తరిస్తోంది. ఒక్క ఎస్ఆర్డీపీ కార్యక్రమంలో భాగంగా రూ.8వేల కోట్లతో
ప్రాజెక్టులు చేపడుతున్నాం. ఇవి పూర్తయిన తర్వాత ఎస్ఆర్డీపీ ఫేజ్-2ను
చేపడతాం. ఇందులో భాగంగా మరో రూ.3500 కోట్ల విలువైన ప్రాజెక్టులు
చేపట్టనున్నాం. సీఆర్ఎంపీ అనే కార్యక్రమాన్ని తీసుకొని నగరంలో 710
కిలోమీటర్లకుపైగా మెయిన్ రోడ్లను ఎంత వర్షం పడ్డా దెబ్బతినకుండా
తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రేపటి అవసరాలను దృష్టిలో
పెట్టుకొని తీసుకోవాల్సిన అన్ని పనులను చేపడుతున్నాం.
ఎంఎంటీఎస్ విస్తరణ కోసం రూ.200 కోట్లు : నగరంలో ఎంఎంటీఎస్ విస్తరణ కోసం
రూ.200 కోట్లు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖను ఆదేశించారు. విస్తరణ
పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తాం. ఈ విషయంలో ఎవరూ ఎలాంటి అనుమానాలు
పెట్టుకోవాల్సిన పనిలేదు. మెట్రో రెండో దశకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో
సంప్రదింపులు జరుపుతున్నాం. రెండో దశలో భాగంగా బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకపూల్
వరకు 26 కి.మీ., నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5 కి.మీ, మైండ్ స్పేస్ నుంచి
ఎయిర్‌పోర్టు వరకు మరో 32 కి.మీ మేర చేపట్టనున్నాం. మెట్రో విస్తరణకు కేంద్రం
సహకరిస్తుందని ఆశిస్తున్నాం. వారు సహకరించినా, లేకపోయినా మొదటి దశ మాదిరిగానే
రెండో దశనూ పూర్తి చేస్తాం. డిసెంబరు నెలాఖరు లేదా వచ్చే ఏడాది జనవరిలో
కొండాపూర్ కూడలి పైవంతెన అందుబాటులోకి తీసుకొస్తాం. ఓఆర్ఆర్ నుంచి
గచ్చిబౌలి పైవంతెన మీదుగా బొటానికల్ గార్డెన్ రోడ్డుపైకి నిర్మిస్తున్న
శిల్పా లేఅవుట్ రెండోదశ ప్రాజెక్టు డిసెంబరు 2023 నాటికి పూర్తయ్యేలా అన్ని
చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు ఈ ప్రభుత్వ హయాంలో మంచినీరు, కరెంటు,
రోడ్లు, శాంతిభద్రతలు బాగు చేసుకున్నాం. ఇక డ్రైనేజీ వ్యవస్థను బాగు
చేసుకోవాల్సి ఉంది. అందుకోసం కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి
కేటీఆర్ తెలిపారు.