హైదరాబాద్ : తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) ఆధ్వర్యంలో వచ్చే
నెల 3, 4 తేదీల్లో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న
ప్రాపర్టీ ఎక్స్పో బ్రోచర్‌ను ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఆవిష్కరించారు. నగరంలోని ఒక హోటల్లో జరిగిన ప్రాపర్టీ ఎక్స్పో
బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమానికి సుధీర్ రెడ్డి ముఖ్య అతిధిగా
హారజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రముఖ ఎంఎన్సీ
కంపెనీలన్ని పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ వైపు చూస్తున్నాయని
చెప్పారు. సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీసుకున్న విప్లవాత్మక
నిర్ణయాలతో దక్షిణాదిలో బెంగళూరు, చెన్నై కంటే హైదరాబాద్ వైపే
పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. ఉప్పల్, ఎల్బీనగర్
ప్రాంతాలకు అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉండడంతో పాటు ఈ ప్రాంతంలో ఇన్నర్
రింగ్ రోడ్డు, నేషనల్ హైవే, ప్లై ఓవర్ల కనెక్టవిటీ బాగుండడంతో
కంపెనీలతో పాటు నివాస సముదాయాలకు డిమాండ్ బాగా పెరుగుతోందని తెలిపారు.
టీబీఎఫ్ కృషితో ఈ ప్రాంతంలో మధ్య తరగతి, సాధారణ ప్రజలకు తక్కువ
దరలలో సొంత ఇళ్లు అందుబాటులోకి రానుండడం శుభ పరిణామన్నారు. వచ్చే 2-3
ఏళ్లల్లో ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ సర్కార్
చర్యలు తీసుకోబోతుందని చెప్పారు. ఇప్పటివరకు నగరానికి పశ్చిమ వైపు
ఉన్న ప్రాంతానికి ఐటీ, ఎంఎన్సీ కంపెనీలు అధికంగా రావడంతో ఆ చుట్టు పక్కల
అభివృద్ధి పరుగులు పెట్టిందని.. ఇప్పుడు అదే స్పీడ్‌లో హైదరాబాద్‌కు తూర్పు
వైపున్న ప్రాంతం అభివృద్ధి చెందనుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీబీఎఫ్
ప్రెసిడెంట్ సి.ప్రభాకర్ రావు, కార్యదర్శి టీ.నరసింహారావు, ఉపాధ్యక్షుడు
శ్రీనివాస్ రమేష్, కన్వీనర్ రవీంద్ర కుమార్, విద్యాసాగర్ రావు, అడ్వైజర్
వెంకటరెడ్డి, చిన్న రాఘవ తదితరులు పాల్గొన్నారు.