రామగుండం సభలో చెప్పింది నిజమా..?
ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేయాలి
రాష్ట్రంలోని కోల్ బ్లాకులను మాకే ఇవ్వాలని సింగరేణి సంస్థ చేసిన విజ్ఞప్తిని
కేంద్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తిరస్కరించింది వాస్తవం కాదా..?
కోల్ బ్లాకులను బహిరంగంగా వేలం వేసింది నిజం కాదా..?
ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోడీ ఇంత పచ్చి అబద్ధాలు ఆడతారా..?
ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్
కుమార్
హైదరాబాద్ : రామగుండంలో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
సింగరేణి సంస్థ అంశంపై రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని
ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
తీవ్రంగా స్పందించారు. గత డిసెంబర్ 13న నిండు పార్లమెంటు సభలో ప్రధాన మంత్రి
నరేంద్ర మోడీ తరపున కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ తెలంగాణ
రాష్ట్రంలోని కోల్ బ్లాకులను బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నామని స్పష్టంగా
చెప్పారు. అయితే తెలంగాణలో ఉన్న ఈ కోల్ బ్లాకులను తమకే అప్పగించాలని సింగరేణి
సంస్థ చేసిన విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
ప్రకటించారు. అని వినోద్ కుమార్ తెలిపారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
పార్లమెంటులో మీ తరపున చెప్పింది నిజమా..?. ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ
రామగుండం సభలో చెప్పింది నిజమా..?? అన్న విషయం తేలాలని వినోద్ కుమార్ డిమాండ్
చేశారు. ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు అని వినోద్ కుమార్ ప్రధాని
మోడీని నిలదీశారు. ప్రధానమంత్రి హోదాలో సింగరేణి విషయంపై నరేంద్ర మోడీ పచ్చి
అబద్ధాలు చెప్పారని అన్నారు.
నిండు పార్లమెంట్ సభలో గత డిసెంబర్ 13న కోల్ బ్లాకులను విక్రయిస్తున్నామని
అందుకు బహిరంగ టెండర్లు పిలిచారని కేంద్రమంత్రి చూసి ప్రహ్లాద్ జోషి మీ
సమక్షంలో చెప్పింది నిజమా లేదా రామగుండం సభలో ప్రధానమంత్రి హోదాలో మీరు
చెప్పింది నిజమా స్పష్టం చేయాలని వినోద్ కుమార్ ప్రధాని మోడీని డిమాండ్
చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోల్ బ్లాకులను తమకే ఇవ్వాలని సింగరేణి సంస్థ
చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తిరస్కరించింది వాస్తవం
కాదా..? అని వినోద్ కుమార్ ప్రశ్నించారు. కళ్యాణ ఖని బ్లాక్ – 6, కోయగూడెం
బ్లాక్ -lll, సత్తుపల్లి బ్లాక్ -lll, పల్లి శ్రావణ్ పల్లి కోల్ బ్లాకులను
విక్రయించేందుకు బహిరంగ టెండర్ పిలిచింది వాస్తవం కాదా అని వినోద్ కుమార్
కేంద్ర ప్రభుత్వానికి నిలదీశారు. రామగుండం సభ లో ప్రజలను తప్పుదోవ పట్టించే
విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడడం సంస్కారం కాదని వినోద్ కుమార్
అన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే రామగుండం సభలో ప్రధాని నరేంద్ర మోడీ
మాట్లాడారు తప్ప అందులో ఏమాత్రం నిజం లేదని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ 1957 ప్రకారం కోల్
మైన్స్ బ్లాక్ లోను బహిరంగ టెండర్ ద్వారా విక్రయించే అధికారం కేంద్ర
ప్రభుత్వానికి ఉందని నిండు పార్లమెంట్ సభలో మీ సమక్షంలో కేంద్ర మంత్రి
ప్రహ్లాద్ జోషి చెప్పింది వాస్తవం కాదా కావాలనుకుంటే పార్లమెంటు రికార్డ్స్ లో
ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా వినోద్ కుమార్ సూచించారు. నూటికి వచ్చినట్లు
తప్పుడు ప్రచారం చేసి ప్రజలకు ముఖ్యంగా సింగరేణి కార్మికులకు తప్పుదోవ
పట్టించే ప్రయత్నం చేయడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోదాకు సరితూగదని వినోద్
కుమార్ పేర్కొన్నారు. సింగరేణి కార్మికులు సమ్మె చేస్తున్న సందర్భంలో
కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర
మంత్రి ప్రహ్లాద్ జోషి నిండు పార్లమెంట్ సభలో సింగరేణి విషయంపై జవాబు
ఇచ్చారని, ఈ అంశం పార్లమెంటు రికార్డ్స్ లో ఉందని వినోద్ కుమార్ వివరించారు.