బేగంపేటలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ
హైదరాబాద్ : మునుగోడులో కమల వికాసం కనిపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
అన్నారు. బేగంపేటలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
అభివృద్ధి వ్యతిరేకులతో తెరాస సర్కారు జతకట్టిందని, తెలంగాణలో బీజేపీ
అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ కార్యకర్తలను
చూసి తాను ఎంతో స్ఫూర్తి పొందానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తెలంగాణ
బీజేపీ శ్రేణులు బలమైన శక్తులని, ఎవరికీ భయపడరని కొనియాడారు. అణచివేతకు
వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు తనలో కొత్త
ఉత్సాహాన్ని నింపారన్నారు. హైదరాబాద్ బేగంపేటలో నిర్వహించిన బీజేపీ స్వాగత
సభలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు.
‘‘మునుగోడు ఉపఎన్నికలో ప్రజలు బీజేపీకి ఒక భరోసా ఇచ్చారు. ఒక అసెంబ్లీ సీటు
కోసం తెలంగాణ సర్కారు మొత్తం మునుగోడుకు పోయింది. తెలంగాణలో అంధకారం ఎక్కువ
రోజులు ఉండదు. మునుగోడులో కమల వికాసం కనిపించింది. తెలంగాణలో వచ్చేది బీజేపీ
సర్కారేనని ప్రజలు చాటి చెప్పారని మోడీ అన్నారు. ‘‘హైదరాబాద్ ఐటీ రంగానికి
హబ్‌గా మారింది. ఐటీలో ముందున్న రాష్ట్రాన్ని అంధవిశ్వాస శక్తులు
పాలిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. మూఢవిశ్వాసాలను
పారదోలుతుంది. ఎర్రజెండా నేతలు అభివృద్ధి, సామాజిక న్యాయానికి వ్యతిరేకులు.
అలాంటి వారితో తెరాస సర్కారు చేతులు కలిపింది. గతంలో పేదలకు ఇచ్చే రేషన్
బియ్యంలోనూ అక్రమాలు చేశారు. ప్రజలను లూటీ చేసే వారు ఎవరైనా సరే వదిలిపెట్టేది
లేదు.
పేదలకు అందాల్సిన నిధుల్లో అవినీతికి తావు లేకుండా చేశాం. పీఎం కిసాన్ నిధులు
నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తున్నాం. ఆధార్, మొబైల్, యూపీఐ వంటి సేవలతో
అవినీతి లేకుండా సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. నేరుగా ప్రజలకే ఇస్తుండటంతో
అవినీతిపరులకు కడుపుమండుతోంది. ప్రజలకు సేవ చేసే లక్ష్యంతోనే బీజేపీ
రాజకీయాలు చేస్తోంది. అవినీతిని సహించనందుకే కొందరు మోడీని తిడుతున్నారు.
నన్ను తిట్టేవాళ్ల గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. ఆ తిట్లను నేను
పెద్దగా పట్టించుకోను. నన్ను, బీజేపీని ఎంత తిట్టినా పర్వాలేదు. కానీ తెలంగాణ
ప్రజల జోలికి వస్తే సహించేది లేదు.
తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అవినీతి, కుటుంబ
పాలన ప్రజాస్వామ్యానికి తొలి శత్రువులు. బీజేపీకి తెలంగాణలో సానుకూల
పరిస్థితి ఉంది. కరోనా సమయంలో పేదల ఆకలి తీర్చేందుకు రూ.3 లక్షల కోట్లు ఖర్చు
చేశాం. తెలంగాణలోనూ 2 కోట్ల మందికి రేషన్ బియ్యం పంపిణీ చేశాం. ప్రధాని
ఆవాస్ యోజన పథకాన్ని తెరాస సర్కారు నిర్వీర్యం చేసింది. రెండు పడక గదుల
ఇళ్లను కట్టిస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు. కేంద్రం అమలు చేస్తున్న
ప్రధాని ఆవాస్ యోజన పథకం లబ్ధి దక్కకుండా చేశారు. నా తొలి ప్రాధాన్యత ప్రజలకే
కుటుంబానికి కాదు. తెలంగాణను అవినీతి, కుటుంబ పాలన నుంచి రక్షించడమే నా
లక్ష్యం అన్నారు.
ఎంతమంది కేసీఆర్‌లు వచ్చినా మోడీ ని అడ్డుకోలేరు : కిషన్ రెడ్డి
‘‘ఈ 8 ఏళ్లలో తెలంగాణలో జాతీయ రహదారుల విస్తీర్ణం రెట్టింపయ్యిందని
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బేగంపేటలో నిర్వహించిన సభలో కిషన్
మాట్లాడారు. ‘‘ఏ రాష్ట్రంలో నైనా ప్రధానికి సీఎం స్వాగతం పలకడం ఆనవాయితీ. కానీ
ఏ రాష్ట్రంలో లేని దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. మహిళ అని చూడకుండా
గవర్నర్‌ను అవమానించారు. ప్రాజెక్టుల ప్రారంభానికి మోడీ వస్తే నిరసనలు
తెలుపుతున్నారు. ప్రధాని రాష్ట్రానికి మళ్లీ మళ్లీ వస్తారు. వేయిమంది
కేసీఆర్‌లు వచ్చినా మోదీని అడ్డుకోలేరని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.