అందుకోసం పారిశ్రామిక దిగ్గజాలకు స్వయంగా అల్పాహారాన్ని వడ్డించిన టీడీపీ
అధినేత
వచ్చే నెల 16న 20 ఏళ్ల వేడుకను జరుపుకుంటున్న ఐఎస్ బీ
ఈ కార్యక్రమానికి చంద్రబాబును ముఖ్య అతిథిగా ఆహ్వానించిన ఐఎస్ బీ డీన్
హైదరాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇండియన్ స్కూల్ ఆప్
బిజినెస్ (ఐఎస్ బీ) 20 ఏళ్ల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలంటూ
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఆహ్వానం అందింది. ఈ మేరకు సోమవారం
హైదరాబాద్ లో చంద్రబాబును కలిసిన ఐఎస్ బీ డీన్ పిల్లుట్ల మదన్ టీడీపీ అధినేతకు
ఆహ్వానం పలికారు. వచ్చే నెల 16న హైదరాబాద్ లోని ఐఎస్ బీలో ఆ సంస్థ 20 ఏళ్ల
వేడుక జరగనుంది. 20 ఏళ్ల క్రితం నాటి ఉమ్మడి రాష్ట్ర సీఎం హోదాలో చంద్రబాబు
హైదరాబాద్ కు తీసుకువచ్చిన ఐఎస్ బీ నేడు వరల్డ్ బిజినెస్ స్కూళ్లలో అగ్రగామిగా
రాణిస్తోంది. ఈ సందర్భంగా ఐఎస్ బీ వేడుకలకు తనకు ఆహ్వానం అందిన విషయాన్ని
చంద్రబాబు స్వయంగా తన సోషల్ మీడియా వేదికల ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా
20 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో ఐఎస్ బీ ఏర్పాటుకు తాను చేసిన కృషిని ఆయన గుర్తు
చేసుకున్నారు. ఐఎస్ బీ డీన్ పిల్లుట్ల మోహన్ తో భేటీ సందర్భంగా నాటి విషయాలను
నెమరు వేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో ఈ సంస్థను ఏర్పాటు
చేసేందుకు పారిశ్రామిక దిగ్గజాలు యత్నిస్తున్న వేళ… వారిని తన ఇంటికి
ఆహ్వానించి వారికి స్వయంగా అల్పాహార విందు వడ్డించి మరీ ఐఎస్ బీని హైదరాబాద్
లోనే ఏర్పాటు చేసే దిశగా చంద్రబాబు ఒప్పించిన సంగతి తెలిసిందే.