ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతిభతో ఉన్నతంగా ఎదగాలి
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.హర్షవర్ధన్
*ఎన్టీఆర్ జిల్లా బ్యూరో ప్రతినిధి : దేశ మాజీ ఉప ప్రధాని, సమతావాది బాబు జగ్జీవన్‌రామ్ జీవితం ఆదర్శనీయమని, ఆయన జీవితాన్ని ప్రేరణగా తీసుకొని బాగా చదువుకుని ప్రతిభతో ఉన్నతంగా ఎదగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.హర్షవర్ధన్ అన్నారు. బాబు జగ్జీవన్‌రామ్ 116వ జయంతి సందర్భంగా శుక్రవారం విజయవాడ లెనిన్ సెంటర్ సమీపంలోని డా. బీఆర్ అంబేద్కర్-బాబు జగ్జీవన్‌రామ్ భవన్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.హర్షవర్ధన్, డైరెక్టర్ విజయ కృష్ణన్, ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ సెక్రటరీ డా. మహేష్ కుమార్ రావిరాల, ఏపీఎస్సీసీఎఫ్సీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.చినరాముడు, జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తదితరులు బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి, చిత్రపటానికి పూల మాలలు అలంకరించి ఘన నివాళులు అర్పించారు. మహోన్నత జాతీయ నాయకులు బాబూ జగ్జీవన్‌రామ్ దేశానికి అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.హర్షవర్ధన్ మాట్లాడుతూ కార్మిక, వ్యవసాయం, ఆహారం, ఉపాధి-పునరావాసం ఇలా ఎన్నో శాఖలకు మంత్రిగా, ఉప ప్రధానిగా బాబూజీ 30 ఏళ్లకు పైగా చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన్ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని ఎదగాలని సూచించారు. పేదరికం నుంచి బయటపడాలంటే ఉన్న ఏకైక మార్గం చదువని గుర్తించాలన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండి పేదల కష్టాలను అర్థం చేసుకొని వారి సంక్షేమం కోసం ఎనలేని కృషి చేశారన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్టడీ సర్కిళ్లు, పాఠశాలలు, హాస్టళ్లను సద్వినియోగం చేసుకోవాలని.. పది మందికి ఆదర్శంగా ఉండేలా ఎదగాలని ప్రిన్సిపల్ సెక్రటరీ హర్షవర్ధన్ సూచించారు.
కలలు కనండి.. వాటి సాకారానికి శ్రమించండి: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ విజయ కృష్ణన్
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ బాబూజీ ఎన్నో కష్టాలను అధిగమించి ప్రజా రంగంలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని, ఆయన జీవితం నుంచి ప్రేరణ పొంది బాగా ఎదుగుతారనే గొప్ప ఉద్దేశంతోనే మహనీయుల జన్మదినోత్సవాలను మనం వేడుకగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఉన్నతమైన కలలు కని సరైన మార్గంలో నడుస్తూ కష్టపడి వాటిని సాకారం చేసుకోవాలని సూచించారు. నైతిక విలువలతో కూడిన శ్రమ ద్వారా మంచి ఫలితాలు సాధించొచ్చని పేర్కొన్నారు.
పదవులకు వన్నె తెచ్చిన మహనీయులు బాబూజీ: కలెక్టర్ ఎస్.డిల్లీరావు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు మాట్లాడుతూ బాబూజీ ఏ పదవి చేపట్టినా సమర్థవంతంగా నిర్వహించి, ఆ పదవులకు వన్నె తెచ్చారని పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ, ఆహార శాఖ మంత్రిగా దేశంలో ఆహార సమస్య పరిష్కారానికి అహర్నిశలు కృషిచేశారన్నారు. ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి బాబూజీ కృషిచేశారని, ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. బాబూజీ గొప్ప వక్త అని, తమ అనర్గళమైన వాగ్ధాటితో ఎందరో ప్రశంసలను అందుకున్నారని వివరించారు.
విద్యార్థి దశ నుంచే కృషి చేయాలి: జేసీ పి.సంపత్ కుమార్
జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో దళితులపై జరిగే అన్యాయాలపైనా, అస్పృశ్యతపైనా పోరాటం చేసిన మహనీయులు బాబూజీ అని పేర్కొన్నారు. విద్యార్ధి దశలోనే బాబూజీ జీవితం గురించి, ఆయన నవ భారత నిర్మాణానికి చేసిన అవిరళ కృషి గురించి తెలుసుకొని కష్టపడి చదివి కెరీర్లో ఉన్నతంగా ఎదగాలని సూచించారు.
ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ సెక్రటరీ డా. మహేష్ కుమార్ రావిరాల, ఏపీఎస్సీసీఎఫ్సీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.చినరాముడు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ దేశ అభివృద్ధికి బాబూజీ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి బి.విజయభారతి, విద్యార్థులు తదితరులు హాజరయ్యారు.