జెఎన్ జె హౌజింగ్ సోసైటీ తీర్పుపై అవగాహన ఉంది
తెలంగాణ రెవెన్యూ, ఐ అండ్ పిఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ
హైదరాబాద్ : రాష్ట్ర రెవెన్యూ, ఐ అండ్ పి ఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా ప్రతినిధులకు ఇచ్చిన లంచ్ కార్యక్రమానికి జె ఎన్ జె హెచ్ ఎస్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ బొమ్మగాని హాజరయ్యారు . ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చిట్ చాట్ లో మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, సిఎం సీ పీ ఆర్ ఓ అయోధ్య రెడ్డి, సొసైటీ సభ్యులు, సీనియర్ జర్నలిస్టులు ఉమా సుధీర్ (ఎన్ డి టి వి ) , వై.నాగేశ్వరరావు (వార్త), బాలకృష్ణ (ఇండియన్ ఎక్స్ ప్రెస్ ) తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా జవహర్ నెహ్రూ జర్నలిస్టుల మ్యాక్ హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరాబాద్ భూమి అప్పగింత అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. జర్నలిస్టులకు భూమి కోసం జె ఎన్ జె హెచ్ ఎస్ 17 ఏళ్ళ క్రితం ఏర్పడిన పాత సొసైటీ అని , భూమి కోసం ప్రభుత్వానికి డబ్బు చెల్లించిందని, నిజాంపేట్ భూమిని స్వాధీనం చేయగా, పేట్ బషీరాబాద్ 38 ఎకరాలు స్వాధీనం చేయాల్సి ఉన్నదని వివరించారు. పేట్ బషీరాబాద్ భూమికి సంబంధించి సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చి ఏడాదిన్నర గడిచినా భూమి స్వాధీనం కాలేదని తెలిపారు. అందుకు మంత్రి స్పందిస్తూ తనకు ఈ అంశం పూర్తిగా తెలుసునని, జె ఎన్ జె హెచ్ ఎస్ కు పేట్ బషీరాబాద్ భూమి అప్పగిస్తామని చెప్పారు. వేరే సొసైటీలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే అంశంతో జె ఎన్ జె సొసైటీ విషయాన్ని కలపవద్దని, దీనిని ప్రత్యేకంగా చూడాలని, ఇందులో 30 ఏళ్ళకు పైగా జర్నలిజంలో ఉండి అనేక మంది రిటైర్ అయ్యారని, 60 మందికి పైగా మరణించారని, కాబట్టి సుప్రీం కోర్టు తీర్పు ఉన్నందున తమ సొసైటీకి భూమిని అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. తప్పకుండా జె ఎన్ జె హెచ్ ఎస్ కు తొలుత ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆలస్యమవుతుండడంతో సభ్యుల్లో ఆందోళన ఉన్నదని చెప్పగా మేము అధికారంలోకి వచ్చి 90 – 95 రోజులే అయ్యాయని, ఈ లోపు ఎన్నికలు వచ్చాయని, మీ అంశంపై ప్రభుత్వం క్లియర్ గా ఉన్నదని, ఎన్నికల షెడ్యూల్ పూర్తయిన నెల రోజుల లోపే మీ జెఎన్ జె సొసైటీకి భూమి అప్పగిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.