*ప్రతి తెలంగాణ పౌరునీ హెల్త్ ప్రొఫైల్ రూపకల్పన
*నిరుపేద ఆటో కార్మికులందరికీ ఇండ్ల స్థలాల కేటాయింపు
*ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ గ్యారెంటీ పథకాల అమలు
*త్రాగునీటికి ఇబ్బందులు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు
*రామగుండం ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 355 అదనపు పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
రాష్ట్రంలోని ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలను ప్రభుత్వం ఉచితంగా అందించడమే లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
దుద్దిళ్ళ శ్రీధర్ బాబ, రామగుండం లోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో సింగరేణి నిధులు 142 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించే 355 అదనపు పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ లతో కలిసి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ, 142 కోట్ల అంచనా వ్యయంతో 355 అదనపు పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి ఈ రోజు ప్రజాప్రభుత్వం శంకుస్థాపన చేసిందని, ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందించే విధంగా ఈ భవన నిర్మాణాన్ని సకాలంలో నిర్మిస్తామని అన్నారు.
రామగుండం ప్రాంతంలో మెడికల్ కళాశాలకు అనుసంధానంగా నర్సింగ్ కళాశాలను సైతం ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. దేశంలోనే అన్ని రాష్ట్రాలలో మన తెలంగాణ విద్య, వైద్యం రంగంలో అగ్ర భాగాన ఉండేవిధంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, భావితరాలకు మానవ వనరులను అందించే విద్యను గత ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేసాయని అన్నారు.
ప్రతి తెలంగాణ పౌరుడీ హెల్త్ ప్రోఫైల్ రూపకల్పనకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగిందని, మన పెద్దపల్లి జిల్లాలో దాదాపు 2000 మంది లబ్ధిదారులు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని వినియోగించుకున్నారని అన్నారు.
ప్రాథమిక వైద్యం అందించే దిశగా కార్పొరేషన్ లో అవసరమైన చోట బస్తీ దవాఖానాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు. ఆర్.ఎం.పి వైద్యులకు శిక్షణ అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. వైద్య విద్యార్థులు ఎంబిబిఎస్ తో ఆపకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని, స్పెషలైజేషన్ చేయాలని అన్నారు.
ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు బోధన అందించే సమయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, దానికి అవసరమైన మేర నిధులు సమకూర్చడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ మెషిన్ లెర్నింగ్ పై అవగాహన పెంచుకోవాలని అన్నారు.
దేశంలోని ఎయిమ్స్ మొదలగు ప్రముఖ వైద్య కళాశాల స్థాయిలో మన ప్రభుత్వ వైద్య కళాశాలలో సైతం విద్యార్థులకు సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులలో గ్యారంటీ పథకాల అమలు ప్రారంభించామని, 23 కోట్ల జీరో టికెట్స్ ఉచిత బస్సు ప్రయాణం క్రింద అందించామని అన్నారు. మహిళలకు ప్రభుత్వం కల్పించిన ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా కలెక్టర్ స్వతహాగా బస్సులో ప్రయాణించి పరిశీలించారని అన్నారు.
మార్చి నెల నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా పథకం ప్రారంభించామని, తెల్ల రేషన్ కార్డు దారులందరికీ జీరో కరెంట్ బిల్లు వస్తుందని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కార్యక్రమం ప్రారంభించామని, 24 గంటల వ్యవధిలో గ్యాస్ సబ్సిడీ సొమ్ము లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నామని, ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెర వేరుస్తున్నామని అన్నారు.
ఇండ్లు లేని నిరు పేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించా మని, రామగుండం ప్రాంతంలో నిరుపేద ఆటో కార్మికులందరికీ ఇండ్ల స్థలాలు అందిస్తామని మంత్రి తెలిపారు.
ప్రజల గురించి సింగరేణి ఉంది అనే భావన వచ్చే విధంగా పనిచేయాలని , గోదావరిఖని పట్టణంలోని రోడ్లు డ్రైనేజీల అభివృద్ధి పై దృష్టి సారించాలని, సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో స్థానిక యువతకు 80 శాతం మేర ఉపాధి కల్పించడంలో సింగరేణి సంస్థ సహకరించాలని ఆయన సూచించారు. ఆర్.ఎఫ్.సి.ఎల్, ఎన్టిపిసి సంస్థలు సైతం స్థానిక యువతకు ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
రామగుండం ప్రాంతంలోని యువతకు పరిశ్రమలకు ఉపయోగపడే నైపుణ్యత కల్పించే శిక్షణ అందించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నామని, ముందుగా పెద్దపల్లిలో టాస్క్ సెంటర్ మంజూరు చేసామని, రామగుండం ఎమ్మెల్యే చోరవతో నైపుణ్య కేంద్రం త్వరలో ఏర్పాటు రామగుండంలో జరుగుతుందని అన్నారు.
రామగుండంలో ఉన్న సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్.ఎఫ్.సి.ఎల్ వంటి పరిశ్రమల అనుసంధానం చేసే విధంగా చిన్న సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎం.ఎస్.ఎం.ఈ పార్క్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు.
జిల్లాలో సాగునీటికి, త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎక్కడ త్రాగునీటి ఇబ్బందులకు గురికాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని అన్నారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా వడ్డీ లేని రుణాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని, మహిళలకు అందించే రుణాలతో వారు ఉపాధి అవకాశాలు పెంచుకోవాలని, బహుళ జాతి కంపెనీలతో పోటీపడే విధంగా మహిళా సంఘాలు రాణించాలని మంత్రి ఆకాంక్షించారు.
మహిళా శక్తి పథకంలో భాగంగా ప్రతి గ్రామంలో ఉన్న పాఠశాల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించే కార్యక్రమం అమ్మ కార్యక్రమం క్రింద చేపడుతున్నామని అన్నారు. గతంలో మహిళలను లక్షాధికారులను చేస్తామని చెప్పామని, ప్రస్తుతం మహిళలను కోటీశ్వరులు చేయాలని లక్ష్యంతో మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, రామగుండంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని తాము చేసిన పోరాటాలు, ఒత్తడి ఫలితంగా గత ప్రభుత్వం సింగరేణి సంస్థ ద్వారా రామగుండంలో వైద్య కళాశాల పనులు చేపట్టిందని అన్నారు.
రామగుండంలోని వైద్య కళాశాలకు అధునాతన ఆసుపత్రి ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రత్యేక చోరవ తీసుకుని 142 కోట్లతో 355 అదనపు పడకల ఆసుపత్రి భవనం మంజూరు చేయడం జరిగిందని, దీనికి మరిన్ని నిధులు మంజూరు చేసి సూపర్ స్పెషాలిటీ వసతులు సైతం ఇక్కడి ప్రజలకు కల్పించాలని ఎమ్మెల్యే కోరారు.
ప్రజలకు మంచి వైద్య సదుపాయాలు అందాలనే ఉద్దేశంతో రామగుండం ఆసుపత్రికి నర్సులను ప్రభుత్వం కేటాయించిందని, ఆరోగ్యశ్రీ పరిమితిని సైతం ఐదు లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగిందని అన్నారు. ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో రూపోందించిన మంత్రి శ్రీధర్ బాబు, వాటి అమలు లోనూ కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీ అమలు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలు ప్రారంభించామని అన్నారు. రామగుండం ప్రాంత అభివృద్ధికి సైతం ప్రభుత్వం కట్టుబడి ఉందని, గతంలో మున్సిపల్ కార్పొరేషన్ గా రామగుండం ఏర్పాటు చేసిన ఘనత శ్రీధర్ బాబుకే దక్కుతుందని అన్నారు.
రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి కోసం మంత్రి ప్రత్యేకంగా 100 కోట్ల నిధులు, అదేవిధంగా గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసం 30 కోట్ల నిధులను మంజూరు చేశారని, స్కిల్ సెంటర్ నిర్మాణ పనులు జరుగుతు న్నాయని తెలిపారు. రామగుండం ఎత్తిపోతల పథకం చివరి పనులు పూర్తిచేస్తే 12 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని , అదేవిధంగా పాలకుర్తి ఎత్తిపోతల పథకాన్ని సైతం ప్రభుత్వం మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, 142 కోట్ల సింగరేణి నిధులతో 5 అంతస్థులలో 355 పడకలతో ఆధునిక ఆసుపత్రి భవనంని నిర్మించి వైద్య కళాశాలకు అనుసంధానం చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య సదుపాయాలను రామగుండంలో అందే విధంగా ఆసుపత్రి నిర్మాణం ఉంటుందని అన్నారు.
పెద్దపెల్లి జిల్లాలో అధికార యంత్రాంగం మంత్రి ఆదేశాల మేరకు విద్య, వైద్య , వ్యవసాయంపై అధిక శ్రద్ధ చూపిస్తుందని, ముందస్తుగా జిల్లా వ్యాప్తంగా 20 గ్రామాలలో రీడింగ్ భవనాలు నిర్మించడం వల్ల పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న దాదాపు 2 వేల మంది యువకులు లబ్ధి పొందుతున్నారని, ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన మౌళిక వసతుల కల్పన జరుగుతుందని తెలిపారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయి నుంచి జిల్లా ఆసుపత్రి, రామగుండం మెడికల్ కళాశాల వరకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లాలోని ఆసుపత్రులలో ఉన్న సదుపాయాలను మంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రామగుండం ఆస్పత్రికి ఆర్వో ప్లాంట్ , సిటి స్కాన్ మంజూరు చేశారని తెలిపారు.
రామగుండం వైద్య కళాశాల ఆసుపత్రికి సిటీ స్కాన్ వచ్చిందని, త్వరలోనే వాటి సేవలు ప్రారంభిస్తామని, వైద్య కళాశాలకు అనుసంధానంగా నిర్మిస్తున్న 355 అదనపు పడకల ఆసుపత్రి భవనాన్ని సైతం నిర్దేశిత 15 నెలల కాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు, సింగరేణి ఆర్ జి ఎం 1 జీఎం శ్రీనివాస్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.