వారసత్వ నేతలను వెంటాడుతున్న భయం
తెలంగాణలో బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోంది
బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకే జాతి పక్షులు
సంగారెడ్డిలో బీజేపీ నిర్వహించిన ‘విజయ సంకల్ప సభ’లో ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ
సంగారెడ్డి : అవినీతిని బయటపెడుతున్నాననే అక్కసుతో కాంగ్రెస్ పార్టీ తనపై విమర్శలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కుటుంబ పాలన సాగించేవారిలో అభద్రతా భావం ఎక్కువని చెప్పారు. సంగారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విజయ సంకల్ప సభ’లో ఆయన మాట్లాడారు. విదేశాల్లో తెలుగు ప్రజలు కీలక భూమిక పోషిస్తున్నారన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కుటుంబ పార్టీలు పాలించాయి. ఆ పార్టీలు ఉన్నచోట ఆయా కుటుంబాలు బాగుపడ్డాయి. దోచుకోవడానికి వారికి ఏమైనా లైసెన్స్ ఉందా?. వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నా. కుటుంబ పార్టీల వల్ల ప్రతిభ ఉన్నవారికీ అన్యాయం జరుగుతోంది. యువతకు అవకాశాలు దొరకడం లేదు. మీ ఆశీర్వాదాలు, నమ్మకాన్ని వృథా కానివ్వను.. ఇది మోదీ గ్యారంటీ. ప్రజల నమ్మకాన్ని వమ్ము కానివ్వను. వారసత్వ నేతలకు భయం పట్టుకుంది. ఆ పార్టీల నేతలు సొంత ఖజానా నింపుతున్నారు. కుటుంబ పాలకుల అవినీతి దళాన్ని వెలికితీస్తున్నా. దోచుకున్న నల్లధనం దాచుకోవడానికే విదేశాల్లో ఖాతాలు తెరిచారు. మేమంతా మోడీ కుటుంబమే అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. రాష్ట్ర యువత కలలను సాకారం చేస్తా. 70 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని పనిని పదేళ్లలో చేసి చూపాం. కాంగ్రెస్, భారాస రెండూ ఒక్కటే. ఆ పార్టీలు కుమ్మక్కయ్యాయని ప్రజలందరికీ అర్థమైంది. కాళేశ్వరం పేరుతో రూ.కోట్లు దోచుకున్నారు. తెలంగాణలో బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోంది. ప్రపంచానికి మనదేశం ఆశాకిరణంగా మారింది. భారత్‌ను సరికొత్త శిఖరాలకు చేర్చాలి. ఇచ్చిన మాట ప్రకారం ఆర్టికల్ 370 రద్దు హామీ అమలు చేశాం. అయోధ్య రామమందిరం నిర్మిస్తామని చెప్పాం. ప్రపంచం గర్వించే రీతిలో రాముడి ప్రతిష్ఠాపన జరిగిందని నరేంద్ర మోడీ అన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఏముందో ప్రజలకు తెలుసు : ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. పటాన్ చెరులో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభకు హాజరయ్యారు. ఈ సభలో మోడీ ప్రసంగిస్తూ తెలంగాణలో బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోందని వెల్లడించారు. తాము మోదీ కుటుంబ సభ్యులమని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని వివరించారు. మీ కలలే నా సంకల్పం అని స్పష్టం చేశారు. 140 కోట్ల మంది భారతీయులే తన కుటుంబం అని ప్రధాని మోడీ తెలిపారు. మాదిగల అభ్యున్నతికి అన్ని చర్యలు తీసుకున్నామని, మాదిగల సమస్యలను అర్థం చేసుకున్నామని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకే జాతి పక్షులు అని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఏముందో ప్రజలకు తెలుసు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ సంక్షేమం కోసం తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. మోడీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా జరిగి తీరుతుందన్నారు. మోడీ ఏదైతే చెబుతాడో అదే చేసి చూపిస్తాడని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తామని చెప్పాం. చేశామా, లేదా? మాట ఇచ్చి బీజేపీ నిలబెట్టుకుందా, లేదా? ఆర్టికల్ 370పై సినిమాలే వస్తున్నాయి. అయోధ్య భవ్య మందిరం నిర్మిస్తామన్నాం…నిర్మించామా, లేదా? అయోధ్య రామయ్యను మీరంతా స్వాగతించారా, లేదా?” అని ప్రశ్నించారు.
భారత్ ను ప్రపంచంలో అగ్రగామి దేశంగా చేస్తాం : భారత్ ను ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలుపుతామని నరేంద్రమోడీ ఉద్ఘాటించారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా భారత్ ను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఈ గ్యారెంటీని నిలబెట్టుకుంటామని, ఇది మోడీ గ్యారెంటీ అని పేర్కొన్నారు. భారత్ ప్రపంచానికి ఆశాకిరణంలా మారిందన్నారు. కాంగ్రెస్ వందల కోట్ల అవినీతిని బద్దలు కొడుతున్నానని, కాంగ్రెస్ నేతలు తనను తిడుతున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వారసత్వ రాజకీయాలను తాను వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు. కుటుంబ వాదం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. కుటుంబ వాదులకు దోపిడీ చేసే లైసెన్స్ ఉందా? అని ప్రశ్నించారు. కుటుంబ పార్టీలు ఉన్న చోట ఆ కుటుంబాలు బాగుపడ్డాయి కానీ ప్రజలు బాగుపడలేదని పేర్కొన్నారు. కొందరు కుటుంబవాదులు గిఫ్టులు తీసుకుని తమ ఖజానా నింపుకుంటారు. నాకు వచ్చిన గిఫ్టులను వేలం వేసి దేశం కోసమే ఖర్చు చేస్తున్నా అని మోడీ వివరించారు. కుటుంబవాదులు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్నారు. నేను మాత్రం ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేదని వెల్లడించారు. కొందరు బ్లాక్ మనీ దాచుకోవడానికి విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారని ఆరోపించారు.
దక్షిణ భారతానికి తెలంగాణ రాష్ట్రమే గేట్ వే : దక్షిణ భారత దేశానికి తెలంగాణ రాష్ట్రమే గేట్ వే అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మంగళవారం సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పటేల్ గూడాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సభావేదికపైకి మోడీని బీజేపీ నేతలు పూల రథంలో ఆహ్వానించారు. ఓపెన్ టాప్ జీప్ ను పూలదండలతో అలంకరించి మోడీని అందులో తోడ్కొని వెళ్లారు. ప్రధాని మోడీతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కిషన్ రెడ్డి వాహనంలో వేదికపైకి చేరుకున్నారు. బీజేపీ కార్యకర్తలు మోడీపై పూల వర్షం కురిపించారు. ఈ సభలో మోడీ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలతో రెండో రోజు కూడా ఉండడం సంతోషంగా ఉందని చెప్పారు. సంగారెడ్డిలో రూ.9 వేల కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించామని, దేశంలోనే తొలి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ ను బేగంపేటలో ప్రారంభించామని చెప్పారు. దీంతో ఏవియేషన్ రంగంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అన్నారు. పదేళ్లలో దేశంలో ఎయిర్ పోర్టుల సంఖ్య రెట్టింపు చేశామని తెలిపారు. ఘట్ కేసర్ – లింగంపల్లి మధ్య ప్రారంభించిన ఎంఎంటీఎస్ రైళ్లతో కనెక్టివిటీ పెరుగుతుందని చెప్పారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని తమ ప్రభుత్వం నమ్ముతుందని మోడీ చెప్పారు.