రాష్ట్రంలో బీహార్ మోడల్ కుల గణన అభినందనీయం
కుత్బుల్లాపూర్ లో నాయి బ్రాహ్మణుల ఆత్మగౌరవ భవనాన్ని పరిశీలించిన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం బీసీల పక్షపాతి అని, రాష్ట్రంలో బీహార్ మోడల్ కుల గణన అభినందనీయమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. మేడ్చల్ జిల్లా పర్యటనలో భాగంగా కుత్బుల్లాపూర్ లో నాయి బ్రాహ్మణుల ఆత్మగౌరవ భవనాన్ని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి పరిశీలించారు. ఈ సందర్భంగా బీసీ ఆత్మ గౌరవ భవనాల నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వం సహకరించాలని కోరుతూ నాయీ బ్రాహ్మణుల నాయకులు దుండ్ర కుమార స్వామికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని, ప్రభుత్వం బీసీల అభివృద్ది కి కట్టుబడి ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కుల గణనకి చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారని గుర్తు చేశారు. బీహార్ కులగణన తరహాలో మన రాష్ట్రంలో కుల గణన చేయడం అభినందనీయమని తెలిపారు. 2022 సంవత్సరంలో బీహార్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ కులాల జనాభాను లెక్కించే లక్ష్యంతో కుల-ఆధారిత గణన నిర్వహించిందని, ఈ గణన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమై ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీహార్ మోడల్ కుల గణన చేపడతామని చెప్పడం అభినందనీయన్నారు. బీహార్ రాష్ట్రంలో కుల గణన మొదటి దశలో అన్ని జిల్లాల్లో, బ్లాకుల్లో పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం కుటుంబాల సంఖ్యను లెక్కించి నమోదు చేశారని, రెండవ దశలో గుర్తించిన కుటుంబాలలో వ్యక్తుల కులం, ఉపకులం, సామాజిక-ఆర్థిక వివరాలను 17 ప్రశ్నల ద్వారా డాటాను ఎనుమరేటర్లు సేకరించారని దుండ్ర కుమార స్వామి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కుల గణన ప్రక్రియ సరళీకృతం చేసి సంక్షిప్త సమాచార అధ్యయనంతో తెలంగాణలో వెనుకబడిన తరగతుల ప్రజలను సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా అన్ని రంగాలల్లో ఎదగడానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ దళ్ సలహాదారుడు వి వెంకటరమణ, బీసీ దల్ గ్రేటర్ యూత్ ఉపాధ్యక్షుడు మహేష్, రాష్ట్రంలోని నాయి బ్రాహ్మణ సంఘం నేతలు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అధ్యక్షులు వెంకటేష్ ,ప్రధాన కార్యదర్శి వి ఎస్ ఆర్ రవి, తులసీరామ్, యాదగిరి అశోక్ ,మల్లేష్, స్వామి, చిటుకుల రవి, నాగరాజ్, ప్రభాకర్, రమణ, మల్లేష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.