మంత్రి పై పూలవర్షం కురిపించి అభిమానం చాటుకున్న ప్రజలు
మంత్రితో చేయి కలిపేందుకు పోటీపడ్డ అభిమానులు
అందరి యోగ క్షేమాలు తెలుసుకుంటూ ముందుకు సాగిన మంత్రి గారు
ఈ అపూర్వ ఘట్టానికి వేదికగా నిలిచిన వరంగల్ తూర్పు నియోజకవర్గం 19 వ డివిజన్ లోని భగత్ సింగ్ నగర్
ప్రజల హర్షధ్వానాల మధ్య 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్, రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించిన మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ
వరంగల్ : దశాబ్ది బిఆర్ఎస్ పాలన తెలంగాణ రాష్ట్రాన్ని శతాబ్ది వెనక్కు నెట్టిందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. బిఆర్ఎస్ పాలనలో ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టుకుంటూ, ఇచ్చిన హామీలను ఒక్కోటిగా అమలు చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రస్థానాన్ని సాగిస్తున్నదని మంత్రి తెలిపారు. వరంగల్ తూర్పు నియోజక వర్గం 19 వ డివిజన్ లోని భగత్ సింగ్ నగర్ లో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద ప్రశేశపెట్టిన 200 యూనిట్ల వరకు ఉచిత్ విద్యుత్, మహాలక్ష్మి పథకం కింద ప్రవేశపెట్టిన రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకాలను మంత్రిగారు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాలను ప్రారంభిస్తున్న సందర్భంగా మంత్రి సురేఖ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరు గ్యారంటీల ద్వారా ప్రజా సంక్షేమానికి కృషి చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నేడు మరో రెండు పథకాలను ప్రారంభించుకున్నామని మంత్రి తెలిపారు. బిఆర్ఎస్ పాలనలో అరిగోసను అనుభవించిన ప్రజలు తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే తమ బతుకులు బాగుపడతాయని, ఇందిరమ్మ రాజ్యం వస్తుందనే ధీమాతో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో రోజే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, చేయూత పథకం కింద రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతూ ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధిని చాటుకున్నదని అన్నారు. తొమ్మిదిన్నరేళ్ళ కాలంలో బిఆర్ఎస్ పార్టీ సాధించలేనిది, రెండు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ సాధించి చూపించడంతో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఓర్వలేక మిగతా పథకాలు ఎప్పుడు అమలు చేస్తారంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టించి, పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. బిఆర్ఎస్ పార్టీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కోట్లు గడించి, నిరుపేదల జీవితాలను బుగ్గిపాలు చేసిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే, అది బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినట్లేనని, బిఆర్ఎస్ వాళ్ళు బిజెపి అమ్ముడుపోయారనే విషయాన్ని ప్రజలు గమనించాలని హెచ్చరించారు. మేడిగడ్డ ప్రాజెక్టు వ్యవహారంలో బిఆర్ఎస్ నాయకుల తీరు హాస్యాస్పదంగా ఉన్నదని, ప్రజలు వాళ్ళ వేషాలు గమనిస్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగి ప్రజాధనం దుర్వినియోగం అయినా, ఒప్పుకోకుండా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ప్రజల దృష్టిలో ఇంకా చులకన అవుతున్నారని అన్నారు. బిఆర్ఎస్ నాయుకుడు కెటిఆర్ కు అధికారంలో ఉన్నప్పుడు కండ్లు నెత్తికెక్కి, ఇప్పుడే కండ్ల ముందు మేడిగడ్డ కూలిపోతున్నా తప్పుడు నివేదికలిస్తున్నారంటూ ఇంకా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీ అమల్లో భాగంగా మిగతా గ్యారంటీలను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు. సోనియా గాంధీ గారి సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అహరహం ప్రజా సంక్షేమానికై నిబద్ధతతో పనిచేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని, వారి జీవితాలను సుసంపన్నం చేసే దిశగా పథకాలను రూపొందించి, అమలు చేస్తున్నదని మంత్రి స్పష్టం చేశారు. రానున్న కాలంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో సంక్షేమం వర్ధిల్లి, ప్రజలు సుఖ శాంతులతో జీవిస్తారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తుకు కాంగ్రెస్ పార్టీ భరోసా నిస్తున్నదని మంత్రి స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని, ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణకు సహకారం అందివ్వాలని మంత్రి కొండా సురేఖ ప్రజలకు పిలుపునిచ్చారు.