హైదరాబాద్: బీసీ కులగణన విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. బలహీన వర్గాలను బలోపేతం చేయడమే ఉద్దేశమని చెప్పారు. రాష్ట్రంలో సమగ్ర కులగణన, సామాజిక, ఆర్థిక ఇంటింట సర్వేపై శాసనసభలో మంత్రి పొన్నం ప్రభాకర్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా చేపట్టిన చర్చలో సీఎం మాట్లాడారు. మంచి కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో తీర్మానాన్ని సభ ముందుకు తీసుకొచ్చామన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను బయటపెట్టారా? అని ప్రశ్నించారు. ‘‘చర్చను ప్రతిపక్షం తప్పుదోవ పట్టిస్తోంది. కులగణనను అమలుచేసే క్రమంలో న్యాయ, చట్టపరమైన చిక్కులపై అనుమానముంటే సూచనలు ఇవ్వండి. అంతేకానీ.. తీర్మానానికే చట్టబద్ధత లేదన్నట్లుగా మాట్లాడటం మనందరికీ మంచిది కాదు. మేం రహస్యంగా ఏమీ చేయడం లేదు. ఈ తీర్మానంపై రాష్ట్ర జనాభాలో అరశాతం ఉన్నవాళ్లకు బాధ ఉండొచ్చు. రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాం.. లెక్కలు బయటకు వస్తే 50 శాతం జనాభా ఉన్నవాళ్లకు రాజ్యాధికారంలో ఎక్కడ భాగం ఇవ్వాల్సి వస్తుందోనన్న బాధ ఉంటుందేమో. ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నేత సభకు రావాలి. భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిత్తశుద్ధిపై మాకు ఎలాంటి అనుమానం లేదు.. కానీ సహవాస దోషం అన్నట్టుగా కొంతమంది పక్కన కూర్చోవడంతో ఆయన్నూ తప్పుదోవ పట్టిస్తున్నారు. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీ కులగణనపై మంత్రివర్గంలో తీర్మానం చేశాం. మీరు అడగకుండానే సభలో పెట్టాం. స్వయంగా మేమే ముందుకు వచ్చి చేస్తున్నాం. విస్పష్టంగా చెప్తున్నాం.. పాలితులుగా ఉన్నవారిని పాలకులుగా తయారుచేయడమే మా ఉద్దేశం. జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించి వాళ్ల ఆర్థిక ప్రయోజనాలను నిలబెట్టాలని భావిస్తున్నాం. ఇంతమంచి తీర్మానం చేసినప్పుడైనా దాన్ని స్వాగతించి సూచనలు చేయాల్సిందిగా కోరుతున్నాం. సహేతుకమైన సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని రేవంత్ అన్నారు.