హైదరాబాద్ : రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ ఆందోల్ నియోజకవర్గం పర్యటనలో ఆందోల్ – జోగిపేట పాలిటెక్నిక్ కళాశాల పక్కన ఎంతో ప్రతిష్టాత్మకంగా అందోల్ నియోజకవర్గ ప్రజల సౌలభ్యం కోసం నూతనంగా నిర్మించనున్న 150 పడకల ఆసుపత్రి నిర్మాణం, నర్సింగ్ కళాశాల ఏర్పాటు, కళాశాల విద్యార్ధుల హాస్టల్ నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. జోగిపేట హైవేకి ఆనుకొని ఉన్న పాలిటెక్నిక్ కళాశాల తోపాటు మెడికల్ కాలేజీ నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని సమకూర్చాలని రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం అందోల్ పాలిటెక్నిక్ కళాశాల ను ఆకస్మికంగా పరిశీలించారు. ఉమ్మడి రాష్ట్రం లో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో పాలిటెక్నిక్ కళాశాలను ఆందోల్ లో ప్రారంభించడం జరిగిందన్నారు. మంత్రి కళాశాలను పరిశీలించారు. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా వర్క్ షాప్ షెడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. కళాశాల విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. సిబ్బందిని అడిగి కళాశాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాస్టల్ భవనాన్ని పరిశీలించారు. ఈ పర్యటన లో విద్యార్ధులకు అవసరమైన మౌలిక సదుపాయాలను, పాలిటెక్నిక్ కళాశాల కాంపౌండ్ వాల్ నిర్మాణం , వర్క్ షాప్ షెడ్డు నిర్మాణం చేస్తున్నట్లుగా మంత్రి వెల్లడించారు. అందుకు అవసరమైన నిధులను మంజూరు చేసినట్టుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అందోల్ ఆర్ డీ ఓ పాండు నాయక్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, స్థానిక కౌన్సిలర్లు సురేందర్ గౌడ్, చిట్టిబాబు, ప్రవీణ్ , ప్రదీప్ గౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వినయ్ కుమార్ గౌడ్, స్థానిక ప్రజా ప్రతినిదులు, రెవెన్యూ , సర్వే శాఖల అధికారులు పాల్గొన్నారు.