ఇద్దరు చిన్నారులు సహా అయిదుగురి దుర్మరణం
కారును వెనుక నుంచి ఢీకొట్టిన లారీ
రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం..ఇంటికి చేరువలో దుర్ఘటన
మిర్యాలగూడ : నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును గుర్తుతెలియని లారీ ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న రెండు కుటుంబాల్లోని అయిదుగురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనలో మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి చెందిన చెరుపల్లి మహేశ్ (32), ఆయన భార్య జ్యోతి (30), కుమార్తె రిషిత (6), మహేశ్ తోడల్లుడు, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నెపల్లికి చెందిన భూమా మహేందర్ (32), ఆయన కుమారుడు లియాన్సీ (2) అక్కడికక్కడే మృతి చెందారు. మహేందర్ భార్య భూమా మాధవి తీవ్రంగా గాయపడ్డారు. ఆమెకు మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందించి తరువాత ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రెండో పట్టణ ఎస్సై క్రిష్టయ్య ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేపట్టారు. కారును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన లారీ ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు చెప్పారు.
దైవదర్శనానికి వెళ్లి వస్తూ : చెరుపల్లి మహేశ్ హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కారులో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, ఇతర ప్రాంతాలకు దైవదర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి వస్తుండగా అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై ఓ లారీ వెనుక నుంచి ఈ కారును ఢీకొట్టింది. అక్కడ మలుపు తిరిగితే మూడు, నాలుగు నిమిషాల్లో ఇంటికి వెళ్లే వారని, ఇంతలో లారీ మృత్యురూపంలో ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు.