హైదరాబాద్ : దేశంలో, రాష్ట్రంలో మత విశ్వాసాలకు స్వేచ్ఛ కల్పించింది
కాంగ్రెస్ ప్రభుత్వాలేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్ర
ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్
వేడుకల్లో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి
మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శపాలన
అందిస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు. సచివాలయం
తలుపులు తెరిచే ఉంటాయి.. ఏ సమస్య వచ్చినా స్వేచ్ఛగా చెప్పవచ్చన్నారు.
ఎన్నుకున్న ప్రజలనే దూరం పెట్టి పోలీసు పహారాలో ఉన్న ప్రభుత్వ ముళ్ల కంచెలు
బద్దలుకొట్టి.. ప్రజలు స్వేచ్ఛగా తమ వాణిని వినిపించే అవకాశం కాంగ్రెస్
ప్రభుత్వం కల్పించిందన్నారు. అభివృద్ధి, అర్హులకు అవకాశాలు కల్పించడమే
ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. క్రైస్తవ, మైనారిటీలు ఏ మారుమూలలో ఉన్నా
సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు.
దేశ పౌరులపై గురుతర బాధ్యత ఉంది : ‘‘కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో
కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు దేశ పౌరులపై గురుతరమైన బాధ్యత
ఉంది. లోక్సభ ఎన్నికల్లో ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగిరినప్పుడే దేశానికి
రక్షణ. కాంగ్రెస్ గెలిస్తేనే దేశంలో సర్వమత సమ్మేళనం శాంతియుతంగా సాగుతుంది.
దేశ భవిష్యత్తు, రక్షణపై అనుమానాలకు తావిచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
మణిపుర్లో కిరాతక చర్యలు కళ్లారా చూశాం. ప్రధాని, హోం మంత్రి మణిపుర్లో
ప్రజలను కాపాడే ప్రయత్నం చేయలేదు. మణిపుర్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ప్రజల ప్రాణ, మానాలకు రక్షణ కల్పించలేదు. ప్రజల ప్రాణాలకన్నా ఎన్నికల ప్రచారమే
కావాలని అందులో మునిగిపోయారు. రాహుల్ గాంధీ మణిపుర్ వెళ్లి జాతుల మధ్య
వైషమ్యాలు తగ్గించే ప్రయత్నం చేశారని వివరించారు. క్రిస్మస్ వేడుకల్లో
స్పీకర్ ప్రసాదరావు, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, సీఎస్ శాంతికుమారి తదితరులు
పాల్గొన్నారు.