అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తమిళిసై
అణచివేత, ప్రజాస్వామ్య పోకడలను ప్రజలు సహించబోరన్న గవర్నర్
కొత్త ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని ప్రశంస
రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి నివాళి
హైదరాబాద్ : ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తామని తెలంగాణ
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త
ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన ఆమె.. ఈ ఉదయం అసెంబ్లీలో ఉభయ సభలను
ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజా సేవలో విజయం
సాధించాలని ఆకాంక్షించారు. అణచివేత, అప్రజాస్వామ్య పోకడలను తెలంగాణ ప్రజలు
సహించబోరన్నారు. కొత్త ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని పేర్కొన్నారు. ప్రజలు తమ
జీవితాల్లో మార్పు కోరుకున్నారని, ఇది సామాన్యుడి ప్రభుత్వమని గర్వంగా
చెప్పుకునే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు
ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. నాలుగు కోట్ల మంది ప్రజల
ఆకాంక్షలతో ఏర్పడిన రాష్ట్రంలో తమ పాలన దేశానికే ఆదర్శం కాబోతోందన్నారు.
అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తామన్నారు. రాష్ట్రం కోసం
ప్రాణత్యాగం చేసిన వారికి సభావేదికగా నివాళి అర్పిస్తున్నట్టు పేర్కొన్నారు.
ప్రజా సంక్షేమం కోసం ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించే ఫైల్‌పై
సీఎం తొలి సంతకం చేశారని గవర్నర్ వివరించారు.