తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
విమానాశ్రయ మెట్రో అలైన్మెంట్ ప్లాన్ నిలిపివేయాలన్న సీఎం
సచివాలయంలో ధరణి పై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
హైదరాబాద్ : ధరణి పోర్టల్‌పై సమగ్ర నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి బుధవారం సచివాలయంలో ధరణి పై సీఎం సమీక్షించారు. ధరణి పోర్టల్‌పై సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిత్తల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భూముల సర్వే, డిజిటలైజేషన్, టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.83 కోట్లు ఇచ్చిందన్న సీఎం ఆ నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిషేధిత భూముల జాబితా, అసైన్డ్, పట్టా భూముల వివరాలు సహా మంత్రులు లేవనెత్తిన అన్ని అంశాలపై నివేదిక ఇవ్వాలని నవీన్ మిత్తల్‌ను సీఎం ఆదేశించారు. భూముల డిజిటలైజేషన్ కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సమస్యలకు నిలయంగా మారిందని ఈ సందర్భంగా సీఎం అన్నట్టు సమాచారం. ధరణిని రద్దు చేసి ఆ స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ దిశగా సీఎం రేవంత్‌రెడ్డి ధరణిపై దాదాపు 2గంటల పాటు సమీక్షించారు.
భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ : తెలంగాణలో భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ధరణిపై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. వివాదాల పరిష్కారానికి ఈ ప్రత్యేక కమిటీ మార్గదర్శకాలు రూపొందించనున్నట్లు తెలిపారు. కోనేరు రంగారావు కమిటీ మాదిరిగానే ఈ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం పేర్కొన్నారు. మంత్రులు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, రైతు ప్రతినిధులు, భూ సంబంధిత చట్టాల్లో నిష్ణాతులు ఈ ప్రత్యేక కమిటీలో ఉంటారని వెల్లడించారు. ధరణి పోర్టల్ ప్రారంభం నుంచి తీసుకున్న నిర్ణయాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారిని సీఎం ఆదేశించారు.
విమానాశ్రయ మెట్రో అలైన్మెంట్ ప్లాన్ నిలిపివేయాలన్న సీఎం : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ విమానాశ్రయ మెట్రో అలైన్మెంట్ ప్లాన్ నిలిపివేయాలని ఆదేశించారు. టెండర్ ప్రక్రియను నిలిపివేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 111 జీవో పరిధిలో మెట్రో అలైన్మెంట్ ఎలా చేశారని సీఎం ప్రశ్నించారు. 111 జీవీ పరిధిలో అభివృద్ధికి అవకాశం తక్కువన్నారు. ఓఆర్ఆర్ ద్వారా మంచి రవాణా సదుపాయం ఉన్నట్లు సీఎం తెలిపారు.
[https://bloomtimes.org/images/srilekha_/Revanth.jpg]