హైదరాబాద్ : భారాస అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీలైనంత త్వరగా కోలుకొని ప్రజా సేవకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను చంద్రబాబు పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి వెలుపల చంద్రబాబు మాట్లాడుతూ.. కేసీఆర్ త్వరగా కోలుకుంటున్నారని చెప్పారు. ‘‘ ఆయనతో మాట్లాడాలనిపించి వచ్చాను. కోలుకోవడానికి ఆరువారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. వైద్యులు చాలా చక్కగా ఆపరేషన్ చేశారు. త్వరలోనే కేసీఆర్ మామూలుగా నడుస్తారని చంద్రబాబు అన్నారు. యశోద ఆస్పత్రిలో ఉన్న కేసీఆర్‌ను పలువురు నేతలు పరామర్శిస్తున్నారు. తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. కేసీఆర్‌ను కలిసి మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స విజయవంతమైందని వైద్యులు తనకు చెప్పినట్లు భట్టి వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకుంటున్నారని అన్నారు. మరోవైపు ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌రాజ్, బీఎస్పీ నేత ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ కూడా కేసీఆర్‌ను పరామర్శించి, క్షేమ సమాచారం తెలుసుకున్నారు. గురువారం రాత్రి ఎర్రవల్లి నివాసంలోని బాత్రూంలో జారిపడటంతో కేసీఆర్ ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి వైద్యులు ఆయనకు శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే ఉంటూ కోలుకుంటున్నారు.