హైదరాబాద్ : రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి నేడు ఉదయం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయం లోని 5 వ అంతస్తు లోని రూమ్ నెంబర్ 11 లోని తన కార్యాలయంలో అధికారికంగా పదవీ భాద్యతలు స్వీకరించారు. ముందుగా వేదపండితులు నిర్వహించిన పూజల అనంతరం సరిగ్గా ఉదయం తొమ్మిదిన్నరకు భాద్యతలు స్వీకరించి, మొత్తం తొమ్మిది నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లపై మంత్రి సంతకాలు చేశారు. ఎమ్మెల్యేలు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, వేముల వీరేశం, కుందూరు జయవీర్, బాలూ నాయక్, కంభం అనీల్ కుమార్ రెడ్డి, రోడ్లుభవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజు, స్పెషల్ సెక్రెటరీ విజయేంద్ర, సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ అశోక్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు మంత్రికి శుభాకాంక్షలు అందచేశారు. ఈ సందర్బంగా తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ, హెరిటేజి భవనంగా ఉన్న శాసనసభ పాత భవనాన్ని పునర్ వ్యవస్తీకరించి దానిలో శాసన మండలి కార్యకలాపాలను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న సి.ఎల్.పి, ఇతర పార్టీల కార్యాలయాలున్న భవనాన్ని తొలగించి పబ్లిక్ గార్డెన్ నుండి లలితా కళా తోరణం వరకు సుందరీకరణ చేసి అసెంబ్లీ ప్రాంగణాన్ని ఒక ఉత్తమ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నట్టు వివరించారు. ఈ విషయంలో మరి కొన్ని రోజుల్లో ముఖ్యమంత్రి, శాసన మండలి చైర్మన్, సంబంధిత అధికారులతో కలసి పరిశీలించనున్నట్టు అన్నారు. రాష్ట్రంలోని రహదారులన్నింటినీ నెలరోజుల్లోగా పూర్తి స్థాయి మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. రానున్న వంద రోజుల్లో తమ ప్రభుత్వం ప్రకటించిన ఆరు హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ప్రకటించారు. నిన్న సి.ఎం ప్రారంభించిన మహాలక్ష్మి కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలనుండి అద్భుతమైన స్పందన వస్తోందని తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి న్యూ ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్గరీని కలువనున్నట్లు, అదేవిధంగా తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు ఢిల్లీకి వెళ్తున్నట్లు కోమటిరెడ్డి చెప్పారు.
సచివాలయంలో తన కార్యాలయంలో భాద్యతలు స్వీకరించిన సందర్బంగా సంతకం చేసిన ఫైళ్ల వివరాలు
*నల్గొండ జిల్లాలో నల్గొండ నుండి ముషంపల్లి మీదుగా ధర్మాపురం వరకు రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా మార్చేందుకు రూ. 100 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం.
*వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజక వర్గంలో లింగంపల్లి నుండి దుగ్యాల రోడ్డును రూ. 4 .15 కోట్ల వ్యయంతో స్ట్రెంతేనింగ్ చేయడం.
*రాష్ట్రంలో 14 స్టేట్ రోడ్లను జాతీయ రహదారులుగా అప్-గ్రేడ్ చేయడం. వీటిలో మల్లెపల్లి నల్గొండ రహదారి, రీజినల్ రింగ్ రోడ్ సౌత్ వైపు ఉన్న చౌటుప్పల్,- ఆమనగల్ -షాద్నగర్-సంగారెడ్డి రహదారి తదితర రోడ్లు ఉన్నాయి.
*హైదరాబాద్ – విజయ వాడ నేషనల్ హై- వే ను ఆరులైన్ల రోడ్డుగా మార్చడం.
*నకిరేకల్-నాగార్జున సాగర్ మార్గంలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడం.
*హైదరాబాద్-కల్వకుర్తి జాతీయ రహదారి 765 లోని ఒక సెక్షన్ మార్గాన్ని నాలుగు లైన్లుగా మార్చడం.
*తెలంగాణా రాష్ట్రానికి కేంద్ర రోడ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధులను అధికంగా కేటాయించేందుకు ప్రతిపాదనలు.
*మరో రెండు పరిపాలనా సంబంధిత ఫైళ్లు.