హైదరాబాద్: మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ కు యశోద ఆసుపత్రి వైద్యులు హిప్ రిప్లేస్మెంట్ (తుంటి ఎముక మార్పిడి) శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. గురువారం రాత్రి ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో కాలుజారి పడిపోయిన కేసీఆర్‌ని కుటుంబ సభ్యులు సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. డాక్టర్ ఎంవీ రావు ఆధ్వర్యంలోని వివిధ విభాగాలకు చెందిన వైద్యుల బృందం పరీక్షల అనంతరం హిప్ రిప్లేస్మెంట్ శస్త్రచికిత్స చేయాలని నిర్ధారించారు. దీంతో శుక్రవారం సాయంత్రం వైద్యుల బృందం శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. కేసీఆర్ సతీమణి శోభ, కేటీఆర్, కవిత, హరీశ్‌రావు, సంతోష్ సహా పలువురు భారాస నేతలు ఉదయం నుంచి ఆస్పత్రిలోనే ఉండి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ఎనిమిది వారాల్లో కేసీఆర్ పూర్తిగా కోలుకుంటారని సర్జరీ అనంతరం యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు.