భద్రతపై ఉన్నతాధికారులతో సీఎస్ సమావేశం
రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులుగా ప్రమాణం
తెలంగాణ కేబినెట్ కూర్పుపై ఇప్పటికే స్పష్టత
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికోసం హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న పనులను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పరిశీలించారు. డీజీపీ రవి గుప్తా, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ లతో కలిసి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. శానిటేషన్ ఏర్పాట్లను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణ, ఇతర ఏర్పాట్లపై ఎల్బీ స్టేడియంలో సీఎస్ శాంతికుమారి సమన్వయ సమావేశం నిర్వహించారు. పోలీస్ ఉన్నతాధికారులతో పాటు కాంగ్రెస్ నేతలు, సాధారణ పరిపాలన అధికారులతో చర్చించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉదయం 10:28 గంటలకు ఉంటుందని అధికారులు తొలుత చెప్పారు. అయితే, తర్వాత ఈ ముహూర్తాన్ని మధ్యాహ్నాం 1.04 గంటలకు మార్చినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, మంత్రులుగా 9 లేదా 18 మంది ఇదే వేదికపై ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం.
ప్రమాణస్వీకారానికి తరలిరానున్న కాంగ్రెస్ పెద్దలు : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు తరలిరానున్నారు. అయితే, స్వల్ప అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సోనియాగాంధీ వస్తారా? లేదా? అనే విషయంలో అందరిలో కొంత సందిగ్ధత నెలకొంది. దీనికి ఆమె తెరదించారు. రేవంత్ ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం మీరు రేపు హైదరాబాద్ కు వెళ్తున్నారా? అని ఒక మీడియా ప్రతినిధి ఆమెను ప్రశ్నించగా ‘వెళ్లొచ్చని ఆమె సమాధానమిచ్చారు. దీంతో, సోనియా హైదరాబాద్ కు వస్తున్నారనే విషయంలో పూర్తి క్లారిటీ వచ్చినట్టయింది.