10 లక్షలకు చేరువలో నవ ఓటర్లు
హైదరాబాద్: రాష్ట్రంలో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో మహిళా ఓటర్లు కీలకం కానున్నారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య తాజాగా 3,26,18,205కు చేరుకుంది. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో వీరు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 1,62,98,418 మంది, మహిళలు 1,63,01,705 మంది ఉన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సెప్టెంబరు నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను ఎన్నికల సంఘం చేపట్టింది. షెడ్యూలు విడుదలకు ముందు అక్టోబరు 4న తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. దాని ప్రకారం మొత్తం 3,17,32,727 మంది ఓటర్లు ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 9న ఎన్నికల షెడ్యూలు ప్రకటించింది. అక్టోబరు 31 వరకు ఓటుహక్కు నమోదు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. వచ్చిన దరఖాస్తులను నవంబరు 10 వరకు పరిష్కరించారు. తాజాగా జిల్లాలవారీగా తుది ఓటర్ల జాబితాలను కలెక్టర్లు ప్రకటించారు. వీటి ప్రకారం అక్టోబరు 4న ప్రకటించిన జాబితాతో పోలిస్తే 8,85,478 మంది ఓటర్లు పెరిగారు. అక్టోబరు 4న ప్రకటించిన జాబితాలో మహిళల కన్నా పురుషులు 28,154 మంది ఎక్కువగా ఉండగా.. తాజాగా దాన్ని మహిళలు అధిగమించారు. పురుష ఓటర్ల కన్నా 3,287 మంది మహిళలు ఎక్కువగా నమోదయ్యారు.
75 అసెంబ్లీ స్థానాల్లో : రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 75 స్థానాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. 44 నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు. 26 జిల్లాల్లో మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉండటం విశేషం. ఏడు జిల్లాలు- కుమురం భీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్, నాగర్కర్నూల్, వనపర్తిలలో మాత్రమే పురుష ఓటర్లది పైచేయిగా ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో మహిళా ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
9.99 లక్షల మంది నవ ఓటర్లు : రాష్ట్రంలో నవ ఓటర్లు రికార్డుస్థాయిలో 9,99,667 మంది నమోదయ్యారు. అక్టోబరు 4న ప్రకటించిన జాబితాలో 18-19 సంవత్సరాల ఓటర్లు 8,11,648 మంది ఉన్నారు. అక్టోబరు 31 తర్వాత మరో 1,88,019 మంది నమోదు కావటం విశేషం. మొత్తం ఓటర్లలో ట్రాన్స్జెండర్లు 2,676 మంది, సర్వీసు ఓటర్లు 15,406 మంది నమోదయ్యారు.