ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్న మంత్రి
బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటన
మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా
పరారీలో ఇంటి యజమాని రమేశ్ జైశ్వాల్…గాలిస్తున్న పోలీసులు
హైదరాబాద్ : హైదరాబాద్ నాంపల్లిలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఊపిరాడక 9 మంది మృతిచెందారు. మృతుల్లో మహమ్మద్ ఆజామ్ (58), రెహనా సుల్తానా (50), ఫైజా సమీన్ (26), తాహూరా ఫరీన్ (35), టూబా, టరూబా (13), జకీర్ హుస్సేన్ (66), హాసిబ్ ఉర్ రహ్మన్ (32), నికత్ సుల్తానా (55) ఉన్నారు.
బజార్‌ఘాట్‌లోని ఓ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగి నాలుగు అంతస్తులకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దట్టమైన పొగ తీవ్రతతో ఊపిరాడక 9 మంది మృతిచెందారు. మృతుల్లో నాలుగు రోజుల పసికందుతో పాటు ఇద్దరు మహిళలు ఉన్నారు. ఘటనాస్థలికి నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో గ్యారేజ్ ఉండటంతో కారు రిపేర్ చేస్తుండగా మంటలు వచ్చాయి. అదే సమయంలో అక్కడ డీజిల్, కెమికల్ డ్రమ్ములు ఉండటం, వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. దీంతో పక్కనే అపార్ట్మెంట్లలో ఉంటున్నవారు భయాందోళనకు గురయ్యారు. గ్యారేజ్‌లో ఉన్న మిగతా కెమికల్ డబ్బాలను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ప్రమాదంతో గ్యారేజ్‌లో ఉన్న పలు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనాస్థలంలో జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. నిచ్చెనల సహాయంతో భవనంలోని మహిళలు, చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ అగ్నిప్రమాదంలో 21 మంది అస్వస్థతకు గురైనట్లు పోలీసులు తెలిపారు. వారిలో 8 మంది అపస్మారస్థితిలో ఉన్నారని, వారందరినీ ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి కేటీఆర్ : నాంపల్లి బజార్ ఘాట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. తీవ్ర గాయాలపాలైన మరో తొమ్మిది మందిని ఆసుపత్రిలో చేర్పించగా.. వారి పరిస్థితి విషమంగానే ఉందని సమాచారం. ప్రమాద స్థలాన్ని మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మంత్రి తలసానితో కలిసి ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద వార్త తెలిసి షాక్ కు గురయ్యానని మంత్రి చెప్పారు. కాగా అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్ యజమాని రమేశ్ జైశ్వాల్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. రెసిడెన్షియల్ బిల్డింగ్ లో కెమికల్ డబ్బాలను నిల్వ చేయడం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు చెప్పారు. బిల్డింగ్ యజమాని రమేశ్ జైశ్వాల్ కు సిటీలో కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయని, అక్కడ తయారైన పలు కెమికల్స్ ను ఈ బిల్డింగ్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో నిల్వ చేస్తున్నాడని వివరించారు. ప్రమాదవశాత్తూ గ్రౌండ్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా ఫస్ట్ ఫ్లోర్ లోని కెమికల్ డబ్బాలకు నిప్పంటుకుని మంటలు భారీ ఎత్తున ఎగసి పడ్డాయని వివరించారు. దీంతో 2, 3 అంతస్తులలో ఉన్న వారు మంటల్లో చిక్కుకున్నారని చెప్పారు. ఒకే కుటుంబంలోని తొమ్మిది మంది చనిపోయారని చెప్పారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోవడం బాధాకరమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపిన మంత్రి.. వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం అందజేస్తుందని వివరించారు. అదేవిధంగా ఆసుపత్రిలో ఉన్న బాధితులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశామని వివరించారు. ఈ ప్రమాదంపై విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ వివరించారు. నివాస సముదాయంలో రసాయనాలను నిల్వ చేసే పరిస్థితి ఎందుకొచ్చిందనేది విచారిస్తామన్నారు.