సిద్దిపేట: కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే రాష్ట్రం పదేళ్లు వెనుకకు పోతదని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట నుంచి ఏడోసారి నామినేషన్ దాఖలు చేశానని, ఇక్కడి ప్రజలపై తనకు పూర్తి విశ్వాసం ఉన్నదని, ఈసారి కూడా మంచి మెజారీటీతో గెలిపించి ఆశీర్వదించాలని మంత్రి కోరారు. సిద్దిపేట ప్రజలు తనకు కుటుంబసభ్యుల లాంటి వారని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇప్పటికే తనకు ఆరుసార్లు అద్భుత విజయం అందించి సేవచేసే అవకాశం ఇచ్చారని అన్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా సిద్దిపేట ప్రజలు కోరుకున్న పనులేగాక ఇంకా ఎన్నో పనులు చేశానని చెప్పారు. గతంలో తెలంగాణలో కరువు కాటకాలు, ఆకలి చావులు, వలసలు ఉండేవన్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా మార్చారని మంత్రి చెప్పారు. రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిగా మార్చారని ఆయన కొనియాడారు. కాబట్టి కాంగ్రెస్, బీజేపీలకు ఓటేసి రాష్ట్రాన్ని మళ్లీ వెనక్కి పోయేలా చేయవద్దని కోరారు.