సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి : వెంకటేశ్వరాలయంలో సీఎం కేసీఆర్ శనివారం ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ వేసే ముందు ప్రతిసారి సీఎం కేసీఆర్ కోనాయిపల్లి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఆలయంలో తొలుత ధ్వజస్తంభానికి మొక్కి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు నామినేషన్ పత్రాలను స్వామి వారి సన్నిధిలో పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు పూజలు నిర్వహించి నామినేషన్ పత్రాలను అందించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి శాసనసభకు వేసే (రెండు సెట్లు) నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు.
విజయాల పరంపర : కోనాయిపల్లి వెంకన్నకు పూజలు చేసిన ప్రతిసారి సీఎం కేసీఆర్ కేసీఆర్‌కు విజయం వరించింది. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018లో జరిగిన ఎన్నికల సమయంలో ఈ ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు చేసి, నామినేషన్ వేశారు. అన్ని సందర్భాల్లోనూ విజయం సాధించారు. మరో విశేషం ఏమిటంటే, 2001లో టీడీపీకి, శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి, ఆపై ఈ ఆలయంలోనే పూజలు చేసి టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) పార్టీని సీఎం కేసీఆర్ ప్రకటించారు.