మీ దయా దాక్షిణ్యాల మీద ఎంపీ కాలేదు : కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం అని కేసీఆర్ అనేక సభలలో గప్పాలు పలికారని, కాళేశ్వరం నిజ స్వరూపంపై కేంద్రం నివేదికలు ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ కాళేశ్వరంలో అవినీతికి పాల్పడింది అనేది అర్ధం అవుతుందన్నారు. కాళేశ్వరం, మేడిగడ్డ, సూదిమళ్లు ఎదో ఒక రోజు కూలిపోతాయన్నారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారని చెప్పిన బీజేపీ ఇప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఇంటరాగేషన్ ఎందుకు చేయలేదని అడిగారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమైన డాక్యుమెంట్లు మాయం చేసే అవకాశం ఉందని, చర్యలు తీసుకోవాలన్నారు. కేసీఆర్ కుటుంబం అక్రమంగా లక్షల కోట్ల రూపాయలతో అధికారంలోకి మూడవ సారి రావాలని చూస్తున్నారన్నారు. దొరల పాలన వద్దని, ప్రజల పాలన కావాలన్నారు. దోపిడీ పాలన వద్దని, ఇందిరమ్మ రాజ్యం కోసం ప్రజలు పోరాటం చేస్తున్నారని తెలిపారు. పడ్డ కష్టాలు పడ్డారని, 25 రోజుల తరువాత కష్టానికి ఫలితం రాబోతుందని అన్నారు. ప్రజలు కోరుకున్న ఇందిరమ్మ రాజ్యం రాబోతుందన్నారు. కురుక్షేత్రంలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. డబ్బు మదంతో వీర్రవీగటం లేదని, 2008లో కేసీఆర్ కుటుంబ ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసన్నారు. మీ దయా దాక్షిణ్యాల మీద ఎంపీ కాలేదు. మంత్రిగా లేను. ఒక వేలు చూపిస్తే నాలుగు వేళ్ళు మీకే చూపిస్తాయి. కొంత మంది పోలీసు అధికారులు బీఆర్ఎస్ పార్టీకి చెంచాలుగా నడుచుకుంటున్నారో దానికి ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుందన్నారు. మీ పరిధిలో పార్టీలకు అతీతంగా నడుచుకోవాలని హితవుపలికారు. ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ప్రోగ్రామ్ ఈ నెల 15 తరువాత ఉంటుందని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.