కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలోని పరిశ్రమలు కర్ణాటకకు తరలించుకుపోతారు
హైదరాబాద్‌లో పెట్టాలనుకున్న ఫ్యాక్స్ కాన్ సంస్థను కర్ణాటకలో పెట్టాలని డీకే శివకుమార్ లేఖ రాశారని ఆరోపణ
కాంగ్రెస్ పార్టీకి సీఎంలు దొరికారు కానీ ఓటర్లు లేరని కేటీఆర్ చురకలు
కాంగ్రెస్ టిక్కెట్లు ఢిల్లీతో పాటు బెంగళూరులో నిర్ణయమవుతున్నాయి
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రులు దొరికారు కానీ, ఓటర్లు దొరకడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన జలవిహార్‌లో జరిగిన తెలంగాణ వ్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నేత జానారెడ్డి పోటీ చేయరు కానీ ముఖ్యమంత్రి పదవి కావాలని చెబుతారని, చాలామంది ఆ పదవి కోసం చూస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు రిస్క్ తీసుకోవద్దన్నారు. కాంగ్రెస్‌లో సొంత నిర్ణయాలు తీసుకునేవారు లేరన్నారు. తెలంగాణలో సమ్మిళిత వృద్ధి కనిపిస్తోందన్నారు. ఐటీ ఎగుమతులు రూ.10 లక్షల కోట్లకు చేరుకున్నాయన్నారు.హైదరాబాద్‌లో పెట్టాలనుకున్న ఫాక్స్ కాన్ సంస్థను కర్ణాటకలో పెట్టాలని కాంగ్రెస్ నేత, అక్కడి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లేఖ రాశారన్నారు. అంతేకాదు తెలంగాణలో వచ్చేది తమ కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆ లేఖలో పేర్కొన్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని పరిశ్రమలు కర్ణాటకకు తరలించుకుపోతారని విమర్శించారు. కర్ణాటకలో 5 గంటల విద్యుత్ ఇస్తున్నామని డీకే శివకుమార్ చెప్పారని, కానీ ఇక్కడ ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఉందన్నారు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. 2014కు ముందు తాగు, సాగునీటి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? చూడాలన్నారు.
కేసీఆర్‌ను ఓడించేందుకు అందరూ ఏకమవుతున్నారని ఆరోపించారు. కానీ కేసీఆర్ సింహం లాంటివారని, సింగిల్‌గానే వస్తారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు? అని నిర్ణయించేది ప్రజలే కానీ రాహుల్ గాంధీ, నరేంద్రమోదీ కాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులతో సమానంగా న్యాయవాదులు పోరాటం చేశారన్నారు. తెలంగాణ అభివృద్ధిపై కొంతమంది కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. దళిత బంధు ప్రకటించాలంటే దమ్ము ఉండాలన్నారు. కాంగ్రెస్ టిక్కెట్లు ఢిల్లీలోనే కాకుండా బెంగళూరులోను నిర్ణయమవుతున్నాయన్నారు. రజనీకాంత్, సన్నీడియోల్ వంటి హీరోలు హైదరాబాద్‌ను అభివృద్ధిని మెచ్చుకున్నారన్నారు. కేసీఆర్ మళ్లీ గెలవకపోతే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుందన్నారు. ఈ పోరాటం ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతోందన్నారు. తెలంగాణ ప్రజలకు పోరాటాలు కొత్త కాదన్నారు. గతంలో నెహ్రూ, ఇందిరా గాంధీతో కొట్లాడారని, ఇప్పుడు మోదీతో కొట్లాడుతున్నామన్నారు. 24వేలకు పైగా కొత్త పరిశ్రమలకు తెలంగాణకు వచ్చాయన్నారు.
ఫాక్స్‌కాన్ కంపెనీ ఆపిల్ ఫోన్లకు సంబంధించిన అనేక పరికరాలు తయారు చేస్తోంది. చైనాలో 15 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించింది. మనం కష్టపడి నాలుగేండ్లు వెంబడి పడి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఒప్పించుకున్నాం. వివిధ వేదికల్లో అమెరికా, చైనా తైవాన్‌లో కలిసిన తర్వాత 2022లో ఫాక్స్ కాన్ చైర్మన్ హైదరాబాద్‌కు వచ్చి సీఎం కేసీఆర్‌ను కలిసి ఫ్యాక్టరీ పెడుతాం అని ప్రకటించారు. ఒక లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదురుగా కొంగరకొలాన్‌లో 200 ఎకరాల స్థలంలో నిర్మాణం ప్రారంభించారు. రెండు అంతస్తులు పూర్తయ్యాయి. వచ్చే ఏప్రిల్, మే నెలలో ఫాక్స్ కాన్ కంపెనీ ప్రారంభం కానుంది అని కేటీఆర్ తెలిపారు. అయితే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫాక్స్‌కాన్ కంపెనీకి అక్టోబర్ 25న లేఖ రాశారు. ఆపిల్ ఎయిర్ పొడ్స్ ఇండస్ట్రీని హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మార్చండి. తొందరల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోంది. హైదరాబాద్ నుంచి పరిశ్రమలను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి బెంగళూరుకు తరలిస్తాం. ఇందుకు తెలంగాణలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుందని డీకే శివకుమార్ తన లేఖలో పేర్కొన్నట్లు కేటీఆర్ గుర్తు చేశారు.