మంథని : ఈ అసెంబ్లీ ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ ఎన్నికల్లో భారాస, బీజేపీ , ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలో రాహుల్ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహిళా సాధికారత సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణలో రూ.లక్ష కోట్ల సంపద దోపిడీకి గురైంది. కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్‌కు, ఆయన కుటుంబానికి ఏటీఎంగా మారింది. రాష్ట్ర సంపదను దోచుకుని తెలంగాణలో ప్రతి కుటుంబంపై అప్పు భారాన్ని మోపారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును తిరిగి ప్రజలకు చెందేలా చూస్తాం. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ మహిళకు నెలకు రూ.2500 అందించనున్నాం. ప్రధాని మోదీ, కేసీఆర్ పాలనలో సిలిండర్ ధర రూ.1,200కు చేరింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం’’ అని రాహుల్ అన్నారు. అంతకుముందు మేడిగడ్డ బ్యారేజ్‌ను రాహుల్ గాంధీ పరిశీలించారు. రాహుల్ వెంట టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి శ్రీధర్ బాబు తదితర నేతలు ఉన్నారు.