ఫోటో ఎగ్జిబిషన్, నీటి సరఫరా మ్యాప్ ల ఏర్పాటులో సూచనలు
డోన్ లో అబ్బిరెడ్డిపల్లె, ఉడుములపాడు చెరువుల పరిశీలన
కర్నూలు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు సర్వం సిద్ధమైనట్లు
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. మంగళవారం సీఎం వైఎస్
జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా హంద్రీనీవా కాలువ నుంచి 77 చెరువులు నీటిని
నింపే కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ
నేపథ్యంలో సోమవారం సాయంత్రం మరోసారి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ లక్కసాగరం,
ఆలంకొండ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. పంప్ స్టేషన్ భవనంలోని మొదటి అంతస్తులో
మూడు మోటార్ల పక్కనే ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కిందకు మార్చాలని
అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించి ఏ ఏ మండలాలకు నీరు ఎలా సరఫరా
అవుతుందని తెలిసేలా ఏర్పాటు చేసిన మ్యాప్ మండలాల వారీగా రంగులు మార్చమని
మంత్రి ఆదేశించారు. పైలాన్ ఆవిష్కరణ ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం 77
చెరువులకు నీరు నింపే కార్యక్రమం ద్వారా డోన్ నియోజకవర్గంలో నీరు రాబోతున్న
అబ్బిరెడ్డి పల్లె, ఉడుములపాడు చెరువులను పరిశీలించారు. 511 ఎకరాల
విస్తీర్ణంలో ఉన్న అబ్బిరెడ్డి పల్లె చెరువు ద్వారా 3వేల ఎకరాలకు పైగా
ఆయకట్టుకు మేలు జరగనుందన్నారు.ఈ సందర్భంగా డోన్ నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రి
బుగ్గన రాజేంద్రనాథ్ చేసిన అభివృద్ధిని జగదుర్తి వాసులు ప్రశంసించారు. మంత్రి
నాయకత్వంలో అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారంటూ తమ ఆనందం వ్యక్తం చేస్తూ
చేతులెత్తి మొక్కారు. భూగర్భ జలాలు పెరిగితే వరితో పాటు ఉద్యానపంటలు వేసుకుని
రైతులు మరింత లబ్ధి పొందే అవకాశం ఉందన్నారు. ఉడుములపాడు చెరువు సరిహద్దులను
పరిశీలించారు. చెరువు మీదుగా వాకింగ్ ట్రాక్ లు ఏర్పాటు చేయాలని మంత్రి
ఆదేశించారు. కంప చెట్లను తొలగించి చెరువు సమీపంలో పరిశుభ్రతను పెంచాలని
కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన
కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్
కుమార్, సంబంధిత జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.