హైదరాబాద్ : దేశ ప్రజలంతా ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని కాంగ్రెస్
అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక
ఎన్నికల్లో పార్టీ విజయాలే దీనికి స్పష్టమైన రుజువని అన్నారు. హైదరాబాద్
వేదికగా సీడబ్ల్యూసీ సభ్యులతోపాటు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ
నేతలు, పార్లమెంటు సభ్యులు, ముఖ్య నేతలతో జరుగుతున్న సమావేశాన్ని ఉద్దేశించి
ఖర్గే ఆదివారం ప్రసంగించారు. వ్యక్తిగత ప్రయోజనాలు, విభేదాలను పక్కన పెట్టి
పార్టీ విజయానికి ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
అదేవిధంగా సంస్థాగత ఐక్యత చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఐక్యత, క్రమశిక్షణ
ద్వారా మాత్రమే ఎదుటి పార్టీలను ఓడించగలమని స్పష్టం చేశారు. *బీజేపీని గద్దె
దించడమే గాంధీకి సరైన నివాళి : ‘ఇది మనం విశ్రాంతి తీసుకునే సమయం కాదు. గత
పదేళ్లలో బీజేపీ పాలనలో సామాన్య ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి. పేదలు,
రైతులు, కార్మికులు, మహిళలు, యువత సమస్యలను పరిష్కరించడంలో ప్రధాని
విఫలమయ్యారు. ప్రధాని ఆత్మవిమర్శ చేసుకోవడంలేదని విమర్శించారు. ఇటువంటి
పరిస్థితుల్లో దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు అందరూ ఏకమై ఈ నియంతృత్వ
ప్రభుత్వానికి తెరదించాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ కాంగ్రెస్
అధ్యక్షుడిగా ఎన్నికై 2024 నాటికి శతాబ్ది కాలం పూర్తి కావస్తోందని, ఈ
నేపథ్యంలో అదే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీని అధికారం నుంచి
గద్దె దించడమే మహాత్ముడికి సరైన నివాళి అని చెప్పారు.
మోడీ సర్కారు అన్నింటా విఫలం : మున్ముందు అనేక సవాళ్లు ఉన్నాయని పేర్కొన్న
ఖర్గే అవి కేవలం పార్టీకే పరిమితం కావని, భారత ప్రజాస్వామ్య మనుగడ, రాజ్యాంగ
పరిరక్షణకూ సంబంధించినవని చెప్పారు. ‘త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు
జరగనున్నాయి. లోక్సభ ఎన్నికలకు ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. జమ్మూ-
కశ్మీర్లోనూ అసెంబ్లీ ఎన్నికలకు మనం సిద్ధంగా ఉండాలి. ఛత్తీస్గఢ్,
రాజస్థాన్లలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు సామాజిక న్యాయం, సంక్షేమం విషయంలో
కొత్త విధానాలకు శ్రీకారం చుట్టాయి. అక్కడి సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా
ప్రచారం చేయాలి’ అని ఖర్గే తెలిపారు. సరికొత్త బలం, స్పష్టమైన సందేశంతో
తెలంగాణ నుంచి ముందుకెళ్తామని చెప్పారు. తెలంగాణలోనే కాకుండా రాబోయే అన్ని
ఎన్నికల్లో గెలవాలని, బీజేపీ దుష్టపాలన నుంచి ప్రజలను విముక్తి చేయాలనే దృఢ
నిబద్ధతతో హైదరాబాద్ నుంచి బయల్దేరతామన్నారు.