అభ్యర్ధుల ఎంపికలో కాంగ్రెస్ బిజీబిజీ : ఛాన్స్ ఎవరికి దక్కేనో..?
నెలాఖరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా
హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు : రాష్ట్రంలోనూ 5 గ్యారంటీలతో రెడీ
హైదరాబాద్ : అభ్యర్థుల ఎంపికలో గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా
గెలుపు గుర్రాలనే బరిలోకి దించేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తులు
చేస్తోంది. ఇప్పటికే ఆశావహులందరి నుంచి అర్జీలు స్వీకరించిన హస్తం పార్టీ దశల
వారీగా పరిశీలిస్తూ వడపోత ప్రక్రియ చేపట్టింది. ఈ మేరకు దరఖాస్తుల పరిశీలనలో
తలమునకలైన ఆ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సర్వే నివేదికలు, నేతల అభిప్రాయాలు,
వినతులను క్రోడీకరించింది. మురళీధరన్ నేతృత్వంలో హైదరాబాద్‌లో భేటీ అయిన
కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ టికెట్ అర్జీదారుల బలాబలాలు, పనితీరు, సర్వేల
ఆధారంగా నివేదిక రూపొందించనుంది.
అభ్యర్ధుల ఎంపికలో కాంగ్రెస్ బిజీబిజీ : ఛాన్స్ ఎవరికి దక్కేనో..?
తెలంగాణలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఎమెల్యే
అభ్యర్ధులను ఎంపిక చేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సభ్యులు
స్క్రీనింగ్ కమిటీకి విజ్ఞప్తి చేశారు. బీసీలకు పీసీసీ నిర్దేశించినట్లు 34
సీట్లు కాకుండా అత్యధిక సీట్లు ఇవ్వాలని ఆ సామాజిక వర్గానికి చెందిన సీనియర్
నేతలు మురళీధరన్‌ను కోరారు. మహిళలకు అత్యధిక సీట్లు ఇచ్చేందుకు చొరవ చూపాలని
కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు
సునీతారావ్, ముదిరాజ్‌లు స్క్రీనింగ్ కమిటీని కోరారు. రెండో రోజు డీసీసీ
అధ్యక్షులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీల నుంచి స్క్రీనింగ్ కమిటీ అభిప్రాయ
సేకరణ చేసింది.
నెలాఖరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా
కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాపై నెలాఖరుకే స్పష్టత వచ్చే అవకాశం
కనిపిస్తోంది. ఒక్కో స్థానానికి ఒకటి నుంచి మూడు పేర్లను ఖరారు చేయాలని
నిర్ణయించిన స్క్రీనింగ్ కమిటీ మరోసారి చర్చించి కేంద్ర ఎన్నికల సంఘానికి
పంపే అవకాశం ఉంది. 35 చోట్ల ఎలాంటి ఇబ్బందులు లేనందున మిగతా చోట్ల పోటీ,
సామాజిక సమీకరణల దృష్ట్యా మరింత లోతుగా చర్చించాలని నిర్ణయించారు. ఒక్కో
స్థానానికి ఒకటి నుంచి మూడు పేర్లను ఖరారు చేయాలని స్క్రీనింగ్ కమిటీ ఆలోచనకు
వచ్చింది.
హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు : రాష్ట్రంలోనూ 5 గ్యారంటీలతో రెడీ
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ
దృష్టిసారించింది. ఇందులో భాగంగా సీడబ్ల్యూసీ సమావేశాల్ని హైదరాబాద్‌లో
నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 16, 17 తేదీల్లో సమావేశాలతో పాటు మరుసటి
బహిరంగ సభ నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది. బహిరంగసభలో కాంగ్రెస్
పార్టీ ఐదు గ్యారంటీలతో పాటు బీఆర్ఎస్ సర్కార్‌పై ఛార్జీషీట్లను విడుదల
చేయనున్నట్లు వెల్లడించారు.