మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
జెడ్పీ చైర్మన్, కలెక్టర్ తో కలిసి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష
నిజామాబాద్ : గత రెండు రోజుల నుండి జిల్లాలో వర్షాలు కురుస్తుండగా, మరింత భారీ
వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు చేసిన నేపథ్యంలో అధికార
యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి
వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా,
సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని సమాయత్తం చేయాలని
అన్నారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తమ తమ కార్య స్థానాల్లోనే
అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని
మంత్రి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని
తన ఛాంబర్లో ఆయన జెడ్పి ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, కలెక్టర్ రాజీవ్
గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డిలతో కలిసి
జిల్లాలో వర్షాల వల్ల నెలకొని ఉన్న పరిస్థితుల గురించి సంబంధిత శాఖల
అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. గత జులై మాసంలో కురిసిన అతి భారీ
వర్షాల వల్ల దెబ్బతిన్న రహదారులు, తెగిన చెరువులు, వాగులు, నీట మునిగిన
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, కూలిన కరెంటు స్తంభాలు తదితర వాటి పునరుద్ధరణ
పనుల వివరాలను శాఖల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. భారీ నుండి అతి
భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని
సూచించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల నుండి ఏదైనా సమాచారం అందిన వెంటనే సహాయక
చర్యలు చేపట్టేలా సిబ్బందిని సమాయత్తపర్చాలని మంత్రి అధికారులకు హితవు
పలికారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రెండు రోజుల నుండి జిల్లాలో
పలుచోట్ల ఒక మోస్తారుగా మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని
అన్నారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందన్నారు. తాజా వర్షాలకు 12
పాత ఇండ్లు పాక్షికంగా ధ్వంసం అయ్యాయని, బాడిసీ చెరువుకు గండిపడిందన్నారు.
పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి రోడ్లు అక్కడక్కడా స్వల్పంగా దెబ్బతిన్న చోట తక్షణమే
పునరుద్ధరణ పనులు చేయిస్తున్నామని తెలిపారు. బాడిసి చెరువు పరివాహక ప్రాంత
ప్రజలతో పాటు పులాంగు వాగు ను ఆనుకుని నివసిస్తున్న వారిని పునరావాస
కేంద్రాలకు తరలించి వసతి కల్పిస్తున్నామని వివరించారు. రానున్న 24గంటల్లో భారీ
వర్ష సూచన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, ప్రజలు ఆందోళన
చెందవద్దని మంత్రి భరోసా కల్పించారు. సమీక్షా సమావేశంలో నగర పాలక సంస్థ
కమిషనర్ ఎం.మకరంద్, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, వ్యవసాయ, వైద్యారోగ్య,
రెవెన్యూ, ఇరిగేషన్, ట్రాన్స్కో, మున్సిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.