హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎల్పీజీ గ్యాస్‌పై భారీ తగ్గింపు అంటూ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీసింది. 2014లో అధికారంలోకి
వచ్చింది మొదలు వరుసగా సిలిండర్ ధర పెంచుకుంటూ వెళ్లిన మోదీ సర్కార్
ఉన్నపళంగా రూ.200 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పైగా ఇది మహిళా సోదరీమణులకు
రాఖీ కానుక అంటూ చెప్పుకొచ్చింది. దీనిపై సామాన్యులు, రాజకీయ నాయకులు
మండిపడుతున్నారు. 2014లో రూ.400గా ఉన్న వంట గ్యాస్ ధరను రూ.1200కు పెంచి
ఇప్పుడు అందులో నుంచి రూ.200 తగ్గించి మహిళలకు కానుక అనడం ఏంటని ఆగ్రహం
వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. ఇన్నేండ్లుగా వంట గ్యాస్
ధరలను విపరీతంగా పెంచి.. ఇప్పుడు నామమాత్రంగా తగ్గించి పేదలకు ఎంతో లబ్ధి
చేశామని గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు. గత పదేండ్లలో ఒక్క ఎల్పీజీ
సిలిండర్‌పై రూ.800 పెంచి.. అందులో నుంచి రూ.200 మాత్రమే తగ్గించిందని
ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా వివరించారు. ఇది కానుక కాదని, సామాన్యుల
జేబులు గుల్ల చేసి దగా చేయడమేనని, ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడమేనని
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.