అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు ధీటుగా అభ్యర్థులను దింపేందుకు హస్తం పార్టీ
నేతలు దరఖాస్తులు ఆహ్వానించారు. ఆగస్టు 25వ తేదీన దరఖాస్తులకు గడువు ముగియడంతో
నేటి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక ప్రకియ ప్రారంభించనుంది.
రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇవాళ్టి నుంచి ఎమ్మెల్యే
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రదేశ్
ఎన్నికల కమిటీ ఇవాళ సమావేశమై అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభించనుంది. పీసీసీ
అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో 35 నుంచి 40 స్థానాలకు
అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసే అవకాశం ఉంది. మిగిలిన నియోజకవర్గాలకు మూడు
పేర్లతో నివేదికలు సిద్ధం చేయనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో కీలక ప్రక్రియ ప్రారంభం
కానుంది. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పూర్తవడంతో మంగళవారం ప్రదేశ్
ఎన్నికల కమిటీసమావేశం కానుంది. పీసీసీ అధ్యక్షుడు, పీఈసీ ఛైర్మన్ రేవంత్
రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు
ఠాక్రే, ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులతో పాటు 26 మంది ప్రదేశ్ ఎన్నికల కమిటీ
సభ్యులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొంటారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం 119 నియోజకవర్గాలకు సంబంధించి వెయ్యి
మందికిపై దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 34 నియోజక వర్గాలకు 10 కన్నా ఎక్కువ
అర్జీలు వచ్చినట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. రేవంత్ రెడ్డి పోటీ చేయనున్న
కొడంగల్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీ చేయనున్న జగిత్యాల నియోజకవర్గాలకు
ఒక్కో దరఖాస్తు వచ్చినట్లు తెలుస్తోంది. మంథనిలో శ్రీధర్‌బాబుతో పాటు మరొకరు
పోటీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. 119 నియోజకవర్గాల వారిగా వచ్చిన దరఖాస్తుల
వడపోత కార్యక్రమాన్ని ప్రదేశ్ ఎన్నికల కమిటీ చేపడుతుంది. ఆశావహుల సీనియారిటీ,
విజయావకాశాలు, పార్టీకి విధేయత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని
నియోజకవర్గానికి మూడు పేర్లు చొప్పున ఎంపిక చేయనుంది. వివాదరహిత, ఒకే
దరఖాస్తు, సీనియర్ నాయకులు తదితర అంశాల్ని దృష్టిలో ఉంచుకుని 35 నుంచి 40
నియోజకవర్గాలలో ఒకే అభ్యర్థిని ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు గాంధీభవన్
వర్గాలు చెబుతున్నాయి.
మిగిలిన స్థానాలకు ముగ్గుర్ని ఎంపిక చేసి స్క్రీనింగ్ కమిటీకి నివేదిస్తుంది.
స్క్రీనింగ్ కమిటీ ఆశావహుల పూర్తిసమాచారం తెప్పించుకుని పరిశీలిస్తుంది.
స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితా కేంద్ర ఎన్నికల కమిటీకి
నివేదిస్తారు. అక్కడ జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తొలి జాబితా
విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వీలైనంత
త్వరగా అభ్యర్థుల ప్రకటన ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది.
సెప్టెంబరు రెండో వారంలో అభ్యర్థుల ప్రక్రియ పూర్తి
వచ్చే నెల మొదటి వారంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశమై అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
చేయనుంది. స్క్రీనింగ్ కమిటీ నివేదించిన జాబితాను నిశితంగా పరిశీలించి కేంద్ర
ఎన్నికల కమిటీ ఒకట్రెండు రోజుల్లోనే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తుంది. ఈ
ప్రక్రియ అంతా కూడా సెప్టెంబర్ 15లోపు పూర్తి చేయాలని రాష్ట్ర కాంగ్రెస్
పార్టీ లక్ష్యంగా నిర్దేశించుకుంది.