ఈ నోటిఫికేషన్ ద్వారా 5089 పోస్టుల భర్తీ
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
టీఆర్టీ నోటిఫికేషన్ను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్ : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఎంతో
కాలంగా ఎదురు చూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేయనుంది.
టీఆర్టీ నోటిఫికేషన్ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం
విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 5089 పోస్టులను ప్రభుత్వం భర్తీ
చేయనుంది. దీనిని డీఎస్సీ ద్వారా విడుదల చేస్తున్నామని సబిత తెలిపారు. రెండు
రోజుల్లో నోటిఫికేషన్ విడుదలతో పాటు విధి విధానాలు విడుదల చేస్తామని విద్యాశాఖ
మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. తెలంగాణలో వరుస ఉద్యోగాల
నోటిఫికేషన్లతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. టీఎస్పీఎస్సీ, పోలీస్
రిక్రూట్మెంట్ బోర్డు, ఇతర బోర్డులు వేలాది సంఖ్యలో ఉద్యోగాలకు
నోటిఫికేషన్లు, పరీక్షలతో దూసుకెళ్తున్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో
కీలకమైన విద్యాశాఖలో అయితే టీచర్ల ఖాళీలు కూడా కోకొల్లలు ఉన్నాయి. తెలంగాణ
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులకు ఖాళీలు ఉన్నాయి.
నేడు టీఆర్టీ నోటిఫికేషన్ రావడంతో అభ్యర్థులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.
కాగా ఇప్పటికే ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నోటిఫికేషన్ను విడుదల
చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 15వ తేదీన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం
నిర్ణయించింది.
పాఠశాల విద్యకు సంబంధించి టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే డీఎస్సీ
నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ వివరాలను
రేపు విడుదల చేయనున్నట్టు తెలిపారు. 5089 ఉపాధ్యాయ, ప్రత్యేక విద్యార్థుల
పాఠశాలల్లో 1523 పోస్టులు భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈసారి
టీఎస్పీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారానే ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ
చేపట్టనున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి రెండ్రోజుల్లో నోటిఫికేషన్,
విధివిధానాలను ఖరారు చేస్తామన్నారు. త్వరలో డీఎస్సీ పరీక్ష నిర్వహించనున్నట్టు
పేర్కొన్నారు.