వరద తక్షణ సాయం కింద రూ.500 కోట్లు
ప్యాట్నీ నుంచి కండ్లకోయ దాకా డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్
ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కల్వకుంట్ల తారకరామారావు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు రాష్ట్ర
ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ
నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ
నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న
తాజా నిర్ణయంతో 43,373 మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా
మారనున్నారు. దీనికి సంబంధించి విధివిధానాలు, నిబంధనలు రూపొందించేందుకు
అధికారులతో కూడిన ఒక సబ్‌కమిటీని ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది.
సచివాలయంలో సుమారు ఐదు గంటలుగా కేబినెట్ భేటీ కొనసాగింది. ఈ భేటీ వివరాలను
మంత్రి కేటీఆర్ మీడియాకు వెల్లడించారు.
మూడు, నాలుగేళ్లలో భారీగా మెట్రో విస్తరణ : మూడు, నాలుగేళ్లలో హైదరాబాద్
మెట్రో వ్యవస్థను భారీగా విస్తరించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని
కేటీఆర్ తెలిపారు. ‘‘రాయదుర్గం – విమానాశ్రయం వరకు మెట్రో రైలు టెండర్
ప్రక్రియ జరుగుతోంది. ఇస్నాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రో విస్తరణకు
నిర్ణయం తీసుకున్నాం. మియాపుర్ నుంచి లక్డీకపూల్ వరకు, ఎల్బీనగర్ నుంచి
పెద్ద అంబర్‌పేట వరకు, ఉప్పల్ నుంచి బీబీ నగర్, ఈసీఐఎల్ వరకు మెట్రో
విస్తరణకు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో కొత్తూరు మీదుగా
షాద్‌నగర్ వరకు మెట్రో విస్తరణ చేపడతాం. ఇక జేబీఎస్ నుంచి తూంకుంట, ప్యాట్నీ
నుంచి కండ్లకోయ వరకు డబుల్ డెక్కర్ మెట్రో నిర్మాణం చేపడతామని వెల్లడించారు.
తక్షణ సాయం కింద రూ.500 కోట్లు : జులై 18 నుంచి 28 వరకు రాష్ట్రంలో
పెద్దఎత్తున వర్షాలు కురిశాయి. వర్షాలు, వరదల వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది.
పది జిల్లాల్లో రైతులు, ప్రజలకు తలెత్తిన తీవ్ర నష్టంపై కేబినెట్లో
చర్చించాం. తక్షణ సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించాం. అలాగే
రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నాం. అలాగే
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇద్దరు విద్యుత్ ఉద్యోగులు ఉద్యోగ ధర్మాన్ని
అద్భుతంగా నిర్వర్తించారు. వీరిద్దరికి ఆగస్టు 15న ప్రభుత్వ సత్కారం
చేయనున్నాం. అలాగే ఆశ్రమ పాఠశాలలో 40 మంది పిల్లలను కాపాడిన టీచర్‌ను
సన్మానిస్తామ ని కేటీఆర్ వివరించారు.
రూ.60వేలకోట్లతో హైదరాబాద్‌లో మెట్రోను విస్తరించనున్నట్లు ఐటీ, పురపాలకశాఖ
మంత్రి కేటీఆర్ కల్వకుంట్ల తారకరామారావు వెల్లడించారు. కేబినెట్ సమావేశం
అనంతరం మంత్రులతో కలిసి ఆయన కేబినెట్ నిర్ణయాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయలాంటిది హైదరాబాద్ నగరం.
భారతదేశంలోనే అద్భుతమైన నగరంగా ఎదిగింది. అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరాల్లో
హైదరాబాద్ అగ్రభాగాన ఉంది. టార్చ్‌బేరర్‌గా ఉంది. పెరుగుతున్న నగరానికి మౌలిక
సదుపాయాలు అంతే ఉండాలని సీఎం కేసీఆర్, కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నది.
ప్రజారవాణాను విస్తృత పరచడం ద్వారా నగరం ఎంత పెరిగినా ఎన్ని పరిశ్రమలు
వచ్చినా, లక్షలాది మంది ప్రజలు వచ్చినా తట్టుకునేలా విశ్వనగరంగా ఎదగడానికి,
అన్నిహంగులతో కూడిన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు కేబినెట్ కీలక
నిర్ణయం తీసుకున్నది. పురపాలకశాఖ మంత్రి సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు
తెలుపుతున్నానన్నారు.
ప్యాట్నీ నుంచి కండ్లకోయ దాకా డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ : ‘హైదరాబాద్ మెట్రో
రైల్‌ను విస్తరిస్తున్నాం. విస్తృతమైన చర్చల తర్వాత రాబోయే మూడు నాలుగేళ్లలో
నిర్దేశిత ప్రతిపాదనలతో చాలా పెద్ద ఎత్తున మెట్రోను విస్తరించాలని నిర్ణయం
తీసుకున్నది. ఇప్పటికే రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఎయిర్పోర్ట్
ఎక్స్‌ప్రెస్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లో ఇప్పటికే 70
కిలోమీటర్ల మెట్రోకు అదనంగా 31 కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్
రూపంలో అందుబాటులోకి రాబోతున్నది. కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు.. జూబ్లీ
బస్టాండ్ వరకు తూంకుంట వరకు దాకా డబుల్ డెక్కర్ మెట్రోను ఏర్పాటు
చేయబోతున్నది. ఒక లెవల్లో వాహనాలు, మరో లెవల్లో మెట్రో ఏర్పాటు చేయడానికి
కేబినెట్ తీర్మానించింది. ప్యాట్నీ నుంచి కండ్లకోయ దాకా డబుల్ డెక్కర్ ఫ్లై
ఓవర్‌ను నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. హైదరాబాద్‌లో మరో ముఖ్యమైన
మార్గం ఇస్నాపూర్ – మియాపూర్ వరకు మెట్రోను విస్తరించాలని, మియాపూర్ నుంచి
లక్డీకపూల్ వరకు, విజయవాడ రూట్లో ప్రస్తుతం ఉన్న మెట్రోను ఎల్బీనగర్ నుంచి
పెద్ద అంబర్‌పేట వరకు హయత్‌నగర్ విస్తరించాలని, వరంగల్ రూట్లో ఉప్పల్
నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ వరకు, మహబూబ్‌నగర్ మార్గంలో
భవిష్యత్‌లో కొత్తూరు నుంచి షాద్‌నగర్ వరకు విస్తరించాలని నిర్ణయించింది.
ఉప్పల్ నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్డు వరకు, ఓల్డ్ సిటీ మెట్రోను పూర్తి
చేస్తాం. ఓఆర్ఆర్ చుట్టూ ఎయిర్‌పోర్టు నుంచి కందుకూరు వరకు మొత్తం కలిపి
రూ.60వేలకోట్లతో మెట్రోను రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది’ అన్నారు.
కేంద్రం సహకరిస్తుందని ఆశిస్తున్నాం : ‘నాలుగైదేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి
చేయాలని సీఎం కేసీఆర్ పురపాలకశాఖను ఆదేశించారు. వీటిపై పూర్తిస్థాయి
ప్రతిపాదనలు సిద్ధం చేసి, వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని సీఎం కేసీఆర్
మెట్రో రైల్ అథారిటీ, మున్సిపల్ శాఖను ఆదేశించారు. హైదరాబాద్ భవిష్యత్‌ను
దృష్టిలో పెట్టుకొని ప్రజా రవాణాను భారత్‌లోనే అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని
సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు పెద్ద ప్రాజెక్టును తీసుకోబోతున్నాం. కేంద్రం
ప్రభుత్వం సైతం సహకరిస్తుందని ఆశిస్తున్నాం. సహాయం చేయకపోయినా రాష్ట్ర
ప్రభుత్వమే పూర్తి చేస్తుంది. ఇప్పటికి కేంద్రం 2024 తర్వాత సంకీర్ణ ప్రభుత్వం
వస్తుంది. అందులో బీఆర్ఎస్ కీలక పాత్ర ఉంటుందన్నారు.