హైదరాబాద్ : ఉద్యమ కారులను రోడ్డున పడేసి ద్రోహులను కేసీఆర్ పక్కన
పెట్టుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. సీఎం
కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో
రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అనగారిపోతున్న ప్రతి వర్గంలోని ప్రజల బతుకులు
బాగుపడాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి
సంజయ్ అన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ఓ ఛాన్స్ ఇవ్వాలని
తెలంగాణ ప్రజలను కోరారు. మీ బతుకులు బాగు చేసేందుకు మాకు ఒక్క ఛాన్స్..ఒకే
ఒక్క ఛాన్స్ ఇవ్వడంటూ విజ్ఞప్తి చేశారు. ఖేలో భారత్ జీతో భాగ్యనగర్
క్రీడల్లో భాగంగా బషీర్ బాగ్ నిజాం కాలేజ్ మైదానంలో నిర్వహించిన క్రికెట్
ఫైనల్ మ్యాచ్ను బండి సంజయ్ వీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలంగాణ
ఏర్పడిన తరువాత కేసీఆర్ కుంటుంబం మాత్రమే తృప్తిగా ఉందని ఆరోపించారు. అందువలన
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సీఎం కుంటుంబం మాత్రమే జరుపుకోవాలని సూచించారు.
రాష్ట్రం ఏర్పడిన తరువాత అన్ని కుంభకోణాలే తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని
మండిపడ్డారు. తెలంగాణ ద్రోహులను కేసీఆర్ చంకలో వేసుకుని తిరుగుతున్నారని
తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణను ఏం అభివృద్ధి చేశారో
చెప్పాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై స్పందించిన బండి కర్ణాటక
ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే గాంధీ భవన్లో తప్ప ఏ ప్రాంతంలో సంబురాలు
జరగలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో కేడర్ లేదని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపే అని ధీమా వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా
బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ‘ఖేలో ఇండియా’ పేరుతో
క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. క్రీడాకారులను ప్రోత్సహించాలని
ఎంపీ లక్ష్మణ్ మంచి నిర్ణయంతో హైదరాబాద్లో కూడా ఈ క్రీడలను ఏర్పాటు
చేస్తున్నట్లు తెలిపారు.
“సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించటం లేదు. బీజేపీకి ఒక్క
అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నా. బీజేపీ అధికారంలోకి వస్తే ఫీజు
రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తాం. అధికారంలోకి రాగానే 2 లక్షల
ఉద్యోగాలు భర్తీ చేస్తాం. కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులను రోడ్డున పడేసి
ద్రోహులను పక్కన పెట్టుకున్నారు. ప్రకటనల రూపంలో వేల కోట్ల ప్రజాధనం వృథా
చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
సీఎం కేసీఆర్ అధికారంలోకి రాక ముందు మద్యం మీద రూ.10వేల కోట్ల ఆదాయం వస్తే
ఇప్పుడు రూ.40వేల కోట్ల ఆదాయం వస్తుందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలోని
ప్రజలను తాగుబోతులను చేయాలనే ఉద్దేశంతోనే మద్యం ధరలు తగ్గించారని మండిపడ్డారు.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడంలేదని ధ్వజమెత్తారు.
ప్రశ్నాపత్రం లీక్ చేసిన వ్యక్తులు బెయిల్ మీద బయట తిరుగుతున్నారని ఆగ్రహం
వ్యక్తం చేశారు.