రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ వద్ద భూమి పూజ…హాజరైన మంత్రి కేటీఆర్
పోటీ ప్రపంచంలో ఓ పరిశ్రమను ఆకర్షించడం ఎంతో కష్టమని వెల్లడి
ఫాక్స్ కాన్ ను స్థానికులు కడుపులో పెట్టుకుని చూసుకోవాలని సూచన
ప్రభుత్వ ఉద్యోగాలు 2 శాతమే ఉంటాయి.. అందరికీ రావడం అసాధ్యం
హైదరాబాద్ : రాష్ట్ర అభివృద్ధికి, యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ముందుకు
వెళ్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని
కొంగర కలాన్ గ్రామంలో ఫాక్స్కాన్ సంస్థకు మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం
ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన కకేటీఆర్ ప్రతి మూడు ఐటీ ఉద్యోగాల్లో ఒకరు మన
రాష్ట్రం నుంచే ఉన్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి
కల్పనలో విఫలమైందన్నారు. ‘రైతుల కన్నీళ్లు తుడవని ప్రభుత్వం కావాలా? లేదా
కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాసే ప్రభుత్వాలు కావాలా’ అని ప్రజలను
ప్రశ్నించారు. ఫాక్స్కాన్ సంస్థ పూర్తయితే 35 నుంచి 40 వేల ఉద్యోగాలు
వస్తాయని వివరించారు. మరో ఐదేళ్లలో కొంగర కలాన్ పరిసరాల రూపురేఖలు మారిపోతాయని
పేర్కొన్నారు. ఏడాదిలోగా ఫాక్స్కాన్ కంపెనీ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు.
తెలంగాణ ఏర్పాడిన తరువాత రాష్ట్రానికి వచ్చిన అతిపెద్ద పెట్టుబడి
ఫాక్స్కాన్దే అని ప్రకటించారు.
రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ లో ఫాక్స్ కాన్ పరిశ్రమకు భూమి పూజ కార్యక్రమం
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్
మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొన్న పోటీ పరిస్థితుల్లో ఓ పరిశ్రమను కానీ, ఓ
సంస్థను కానీ తీసుకు రావడం మామూలు విషయం కాదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా
మోడీ పెట్టే ఇబ్బందులను తట్టుకుని తెలంగాణకు పరిశ్రమలను ఆకర్షించడం ఆషామాషీ
వ్యవహారం కాదని అన్నారు. సీఎం కేసీఆర్ అందించిన ప్రోత్సాహంతో ఐటీ విభాగం,
పరిశ్రమల విభాగం ఎంతో పోరాడుతుంటేనే ఒక్కో పరిశ్రమ, సంస్థ రాష్ట్రానికి
వస్తున్నాయని తెలిపారు. కష్టసాధ్యమైన పరిస్థితుల్లో కంపెనీలను రాష్ట్రానికి
తీసుకువస్తున్నామని, అయితే, వచ్చిన కంపెనీలను కడుపులో పెట్టుకుని
చూసుకోవాల్సిన బాధ్యత స్థానికులపైనే ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణకు
వచ్చిన అతిపెద్ద పెట్టుబడి ఫాక్స్ కాన్ సంస్థేనని, మునుపెన్నడూ లేని స్థాయిలో
ఫాక్స్ కాన్ సంస్థ లక్ష ఉద్యోగాలు తీసుకువస్తోందని తెలిపారు.