జులై 17 నుంచి తరగతులు
డిగ్రీలో మొత్తం సీట్లు 3.86 లక్షలు
ఈసారి కొత్తగా నాలుగేళ్ల బీఎస్సీ ఆనర్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సు
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో 2023-24
విద్యా సంవత్సరంలో ప్రవేశానికి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్-తెలంగాణ(దోస్త్)
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 16వ తేదీన ప్రారంభం కానుంది. ప్రవేశాల ప్రక్రియ
మూడు విడతలుగా జరగనుంది. జులై 17న తరగతులు మొదలవుతాయి. రాష్ట్ర ఉన్నత
విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, కళాశాల విద్యాశాఖ
కమిషనర్ నవీన్ మిత్తల్ తదితరులు దోస్త్ నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్
కాలపట్టికను విడుదల చేశారు. గత ఏడాది మొత్తం 4,72,214 డిగ్రీ సీట్లు
అందుబాటులో ఉండగా ఈసారి ఆ సంఖ్య 3,86,544కి తగ్గింది. అంటే దాదాపు 84 వేల
సీట్లకు కోత పడింది.
ఈ సందర్భంగా లింబాద్రి, నవీన్ మిత్తల్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆరు సంప్రదాయ
విశ్వవిద్యాలయాలు, కొత్తగా ఏర్పాటైన మహిళా విశ్వవిద్యాలయంలో బీఏ, బీకాం,
బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల్లోని సీట్లను దోస్త్ ద్వారా
భర్తీ చేస్తామని తెలిపారు. జేఎన్టీయూహెచ్లో బీబీఏ డేటా ఎనలిటిక్స్
కోర్సులోని 60 సీట్లను కూడా దీని ద్వారానే భర్తీ చేస్తామని పేర్కొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 136 కలుపుకొని మొత్తం 1,054 కళాశాలలు దోస్త్
పరిధిలో ఉన్నాయన్నారు. దీని పరిధిలోకి రాని కళాశాలలు 63 ఉన్నాయని, వాటిలోని
దాదాపు 35 సీట్లను యాజమాన్యాలే భర్తీ చేసుకుంటున్నాయని చెప్పారు. ఈసారి
బీఎస్సీ ఆనర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ పేరిట నాలుగేళ్ల కోర్సు
ప్రవేశపెడుతున్నామని, ఆసక్తి లేనివారు మూడేళ్ల తర్వాత డిగ్రీ పట్టా తీసుకొని
వెళ్లిపోవచ్చన్నారు. రాష్ట్రంలో 11 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఆ కోర్సు
ప్రారంభిస్తామని వివరించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి
శ్రీనివాసరావు, కళాశాల విద్యాశాఖ ఆర్జేడీలు డాక్టర్ జి.యాదగిరి, రాజేందర్
సింగ్, అకడమిక్ గైడెన్స్ అధికారి డాక్టర్ డి.తిరువెంగళ చారి తదితరులు
పాల్గొన్నారు.
సీట్లు ఎందుకు తగ్గాయంటే? : కొన్ని కళాశాలల్లో మొత్తం 60 సీట్లకు గాను 15
మందిలోపు చేరిన సెక్షన్లను గత విద్యా సంవత్సరం దోస్త్ రెండో విడత ప్రక్రియ
తర్వాత ఫ్రీజ్ చేశామని నవీన్ మిత్తల్ తెలిపారు. ఉదాహరణకు నాలుగు సెక్షన్లు
ఉంటే రెండుకు తగ్గించామన్నారు. తక్కువ మంది పిల్లలుంటే నాణ్యమైన విద్య
అందించేందుకు యాజమాన్యాలు చొరవ తీసుకోవని చెప్పారు. అందువల్ల ఈసారి సీట్లు
3,86,544కు తగ్గాయని తెలిపారు. ఈసారి నైపుణ్య ఆధారిత కోర్సులు మరికొన్నిటిని
అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. హోటల్ మేనేజ్మెంట్ సీట్ల భర్తీని కూడా
దోస్త్ పరిధిలోకి తీసుకురావొచ్చా? లేదా? అన్న అంశంపై చర్చిస్తామని చెప్పారు.
ఈ ఏడాది నుంచే పరీక్షల్లో సంస్కరణలు : ఉద్యోగావకాశాలు పెంచేందుకు విద్యార్థుల
ప్రతిభను గుర్తించే విధానంలో మార్పుల కోసం పరీక్షల్లో సంస్కరణలు చేసేందుకు గత
ఏడాది ఐఎస్బీతో ఒప్పందం కుదుర్చుకున్నామని లింబాద్రి తెలిపారు. ఆ కమిటీ
క్షేత్రస్థాయిలో కూడా పర్యటించిందని, త్వరలో ఉపకులపతుల సమావేశం ఏర్పాటు చేసి
దశలవారీగా పరీక్షల విధానంలో చేయాల్సిన మార్పులను ప్రకటిస్తామని పేర్కొన్నారు.
ఈసారి కొత్తగా మరికొన్ని : విద్యార్థులు సందేహాలను తీర్చుకునేందుకు గత ఏడాది
కాల్సెంటర్ ఏర్పాటు చేశారు. ఈసారి లైన్లను రెట్టింపు చేస్తున్నారు. దోస్త్
పేరిట యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. దాన్ని స్మార్ట్ ఫోన్లో
డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో ఎస్టీ విద్యార్థులకు 6
నుంచి 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తారు. భారత్ పే ద్వారా దరఖాస్తు ఫీజు
చెల్లించవచ్చు.