తెలంగాణ మోడల్ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం
కార్యాచరణ రూపొందించిన ప్రభుత్వం
సీఎం కెసిఆర్ ఆమోదం తర్వాత తుది ప్రణాళిక
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవంగా
నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014 జూన్ 2న తెలంగాణ
ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. మరి కొద్దిరోజుల్లో పదో సంవత్సరంలోకి
అడుగిడబోతోంది. దీన్ని పురస్కరించుకొని జూన్ 2 నుంచి పది రోజుల పాటు
రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేలా
ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ
జరిగిన ప్రగతిపై విస్తృతంగా ప్రచార కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం
చేసింది. ముఖ్యంగా దేశానికి తెలంగాణ మోడల్ అభివృద్ధి, సంక్షేమ పథకాల అవసరం
ఉందనేది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించారు.
రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లా, మండల స్థాయుల్లోనూ దశాబ్ది వేడుకల
నిర్వహణకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్
వద్ద సమీక్ష జరగనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి
మార్గనిర్దేశం, ఆదేశాలు, సూచనల మేరకు తుది కార్యాచరణను రూపొందించనున్నట్లు
ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి.
ప్రజల ముందుకు ప్రగతి : మరో ఆరునెలల్లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు రానుండడం..
ఇదే ఏడాది ప్రత్యేక రాష్ట్రం అవతరించి పదో సంవత్సరంలోకి అడుగుపెట్టడం.. ఈ
రెండింటిని దృష్టిలో పెట్టుకొని కార్యాచరణకు రూపకల్పన చేసినట్లుగా
తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తుంది? అని పదేళ్ల కిందట పలికిన
వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. వాటికి సమాధానంగా రాష్ట్ర ప్రగతిని ప్రజల ముందుకు
తీసుకెళ్లనున్నారు. ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఆకాంక్షలతో
ఏర్పాటైన తెలంగాణలో ఈ మూడు అంశాల్లో ఇప్పటివరకూ సాధించిన అభివృద్ధిని
క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ల్లాలని సంకల్పించారు.
కాళేశ్వరం, మిషన్ భగీరథ సహా పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల
కరెంటు, పారిశ్రామికంగా అంతర్జాతీయ గుర్తింపును సాధించడం.. దిగ్గజ ఐటీ సంస్థలు
తమ ప్రధాన కార్యాలయాలను హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకొని కొలువుదీరడం,
ప్రైవేటులో ఉద్యోగావకాశాలు పెరగడం, టీఎస్పీఎస్సీ సహా వైద్య, పోలీసు శాఖల్లోనూ
ఉద్యోగ నియామకాలు చేపట్టడం తదితరాలను ప్రధాన ప్రచారాంశాలుగా పేర్కొనాలని
నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. తాము సాధించిన అభివృద్ధిని తెలంగాణ ప్రజలకు
చెప్పడానికి దశాబ్ది ఉత్సవాలను ఒక వేదికగా వినియోగించుకోవాలని ప్రభుత్వం
భావిస్తోంది. ఈ ఉత్సవాల్లో అన్ని శాఖలను భాగస్వాములను చేయనున్నారు. ఎస్సీ,
ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ, మహిళలు, పాత్రికేయులు తదితర అన్ని వర్గాలకూ
గడిచిన పదేళ్లలో ఏ రకంగా అభివృద్ధిని, సంక్షేమ ఫలాలను అందించారనే కోణంలో
కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఒక్కో వర్గానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు
ఖర్చుపెట్టారు? పథకాలు, అంశాల వారీగా ఎంతమంది లబ్ధిపొందారు? జిల్లాలు,
నియోజకవర్గాల వారీగా గణాంకాలను ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించినట్లు
తెలిసింది. రాష్ట్రం ఏర్పడిన కేవలం పదేళ్లలోపే ప్రగతి సూచికల్లో కేరళ,
తమిళనాడు సహా పలు పెద్ద రాష్ట్రాలతో పోటీ పడిందని, ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధి
దేశానికే దిక్సూచిగా మారిందనే కోణంలో ఆయా అంశాలకు విశేష ప్రాధాన్యం కల్పించేలా
ప్రణాళికలు రూపొందించినట్లు తెలిసింది.