హైదరాబాద్ : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర నిర్విరామంగా
కొనసాగుతోంది. మార్చి 16న ‘పీపుల్స్ మార్చ్’ పేరుతో ప్రారంభించిన ఈ పాదయాత్ర
శుక్రవారం నాటికి 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా భువనగిరి
నియోజకవర్గం, బీబీనగర్ మండలం గొల్లగూడెం శివారులో పీసీసీ ప్రధాన కార్యదర్శి
నూతి సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్కుమార్రెడ్డిలు భట్టితో
కేక్ కోయించి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటివరకు భట్టి 250 గ్రామాల మీదుగా
610 కిలోమీటర్లు నడిచారు. ఉత్తర తెలంగాణలోని బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్,
బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, రామగుండం, ధర్మపురి, హుజూరాబాద్,
హుస్నాబాద్, వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్, స్టేషన్ ఘన్పూర్, జనగామ
నియోజకవర్గాల అనంతరం ఆయన యాత్ర ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల మీదుగా
సాగుతోంది. గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ భట్టి పాదయాత్ర
సాగిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
సాగునీటి ప్రాజెక్టులను సందర్శించి లోపాలను ఎండగట్టారు. బోథ్ నియోజకవర్గంలోని
ఆదివాసీ పల్లెల్లో సమస్యలను స్వయంగా పరిశీలించారు. కేసులాపూర్లోని నాగోబా
దేవాలయాన్ని సందర్శించి మెస్రం వంశస్థుల జీవనస్థితిగతులను తెలుసుకున్నారు.
ఇంద్రవెల్లి స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించి పోరాటవీరుల త్యాగాలను వృథా
కానివ్వబోమన్నారు.
బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల్లో బొగ్గు గనులను పరిశీలించి సింగరేణికి
పూర్వ వైభవం తీసుకొస్తామని కార్మికులకు భరోసా ఇచ్చారు. రామగుండం, ధర్మపురి,
హుజూరాబాద్, హుస్నాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో అకాల వర్షాలకు
దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతన్నలకు ధైర్యం చెప్పారు. వరంగల్ వెస్ట్
నియోజకవర్గంలో కాకతీయ యూనివర్సిటీని సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు.
యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతించాలంటూ ఏడాదిగా దీక్షలు చేస్తున్న డ్రైవర్ల
శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. భువనగిరి నియోజకవర్గం బస్వాపూర్
రిజర్వాయర్ డ్యాంపై బియ్యం తిమ్మాపురం, లప్ప నాయక్ తండాలకు చెందిన
నిర్వాసితులు చేస్తున్న దీక్షా శిబిరాలకు వెళ్లి సంఘీభావం తెలిపారు.
ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ అంబేడ్కర్ జయంతి రోజున మంచిర్యాలలో
సత్యాగ్రహసభ నిర్వహించారు. భట్టి యాత్ర జూన్ 15న ఖమ్మం జిల్లాలో ముగుస్తుంది.
నిధులు పంచుకున్నారు : తెలంగాణ ఏర్పడిన తరువాత రూ.5 లక్షల కోట్ల అప్పులు
తెచ్చి భారాస నాయకులు పంచుకుతిన్నారు. ప్రభుత్వ ఆస్తులు పెరగలేదు. ఉపాధి,
ఉద్యోగావకాశాలు రాలేదు. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యాలతో పోరాడి సాధించిన
తెలంగాణ రాష్ట్రంలో ఒరిగిందేమీ లేదని ప్రజలు రగిలిపోతున్నారు. ప్రజాగ్రహం
వెలువెత్తి భారాస ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయం. ఇప్పటివరకు 50కి పైగా
గ్రామాల్లో కూడలి సమావేశాలు నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా
వ్యతిరేక విధానాలను ఎండగట్టాం అన్నారు.