కాంగ్రెస్ సమాయత్తం అవుతోంది. ఈనెల 8వ తేదీన సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించ
తలపెట్టిన నిరుద్యోగ నిరసన బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ
డిక్లరేషన్ ప్రకటిస్తారు. మొట్టమొదటిసారి ప్రియాంక గాంధీ తెలంగాణలో
అడుగుపెడుతుండడంతో రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో
నిర్వహిస్తున్న నిరుద్యోగ నిరసన సభను కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం
ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై పోరాటాన్ని
తీవ్రతరం చేసింది. అన్ని రకాలుగా పోరాటం చేస్తున్న కాంగ్రెస్.. హైదరాబాద్లో
నిర్వహిస్తున్న నిరుద్యోగ నిరసన ర్యాలీ సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ
కృషి చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు,
నాయకులకు పిలుపునిచ్చారు.
ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ సరూర్నగర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ.. నిరుద్యోగ
నిరసన సభ నిర్వహించనుంది. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున యువత
తరలిరానుంది. మరోవైపు ఈ సభలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ
పాల్గొననున్నారు. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రియాంక ఈనెల 8వ
తేదీన సాయంత్రం తన ప్రచారాన్ని ముగించుకుని హైదరాబాద్ రానున్నారు. బేగంపేట
విమానాశ్రయానికి 8వ తేదీ సాయంత్రం ప్రియాంక చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి
రోడ్డు మార్గాన ఎల్బీనగర్ కూడలికి వస్తారు. అక్కడ తెలంగాణ అమరవీరుడు
శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత
సరూర్నగర్ ఇండోర్ స్టేడియానికి చేరుకుంటారు. అయితే ఎల్బీనగర్ నుంచి సరూర్నగర్
ఇండోర్ స్టేడియం వరకు పెద్ద ఎత్తున ర్యాలీతో ప్రియాంక రానున్నారని టీపీసీసీ
చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ ర్యాలీకి పెద్ద ఎత్తున యువత
తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే సరూర్నగర్ ఇండోర్ స్టేడియం అనుమతి కోసం
కాంగ్రెస్ నేతలు దరఖాస్తు చేశారు. ఇవాళో రేపో అనుమతి వచ్చే అవకాశం ఉందని
తెలిపారు.
ఇతర జిల్లాల యువతకు కూడా పిలుపు
ప్రియాంక గాంధీ మొదటిసారి తెలంగాణకు వస్తున్నందున ఘనస్వాగతం పలకాలని పీసీసీ
నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆమెను స్వాగతించడానికి పెద్ద ఎత్తున యువతీయువకులు
తరలిరావాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఇందుకోసం హైదరాబాద్ నగరంతో పాటు
నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో యువత
తరలిరావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరారు.యువత సమస్యలపై దృష్టి:
ఈ సభలో యువత విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రియాంక గాంధీ
ఎండగడతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పార్టీ అధికారంలోకి వచ్చాక యువతను
ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో డిక్లరేషన్ ద్వారా వెల్లడిస్తారని
చెప్పాయి. బహిరంగ సభ విజయవంతం చేసేందుకు జిల్లాల వారీగా పాదయాత్రలు చేసి
కార్నర్ సమావేశాలు నిర్వహించిన రేవంత్ రెడ్డి.. యువతతోపాటు కాంగ్రెస్
కార్యకర్తల్లో, నాయకుల్లో ఉత్సాహాన్ని నింపారు.