హైదరాబాద్ : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వివేకానంద
రెడ్డి హత్య కేసులో ఏ-1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి ఈరోజు సీబీఐ కోర్టులో
లొంగిపోయారు. ఇటీవలే గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టును
సీబీఐ ఆశ్రయించింది. అంతేకాకుండా, వైఎస్ వివేకా హత్య కేసులో ఏ-1 గా ఉన్న ఎర్ర
గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టును సీబీఐ విజ్ఞప్తి
చేసింది. దీంతో ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేస్తూ మే
5వ కోర్టులో లొంగిపోవాలని గంగిరెడ్డిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీబీఐ
కోర్టులో నేడు ఎర్ర గంగిరెడ్డి లొంగిపోయారు. దీంతో సీబీఐ కోర్టు జూన్ 2వ తేదీ
వరకు ఆయనకు రిమాండ్ విధించింది. మరికాసేపట్లో చంచల్‌గూడ జైలుకు సీబీఐ
అధికారులు ఎర్ర గంగిరెడ్డిని తరలించారు. వివరాల్లోకి వెళ్తే వివేకానంద రెడ్డి
హత్య కేసుకు సంబంధించి గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు
చేసిన పిటిషన్‌పై గత నెల (ఏప్రిల్ 27)లో విచారణ జరిపిన తెెలంగాణ హైకోర్టు
గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేసింది. అనంతరం మే 5వ తేదీలోపు ఎర్ర గంగిరెడ్డి
సీబీఐ ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఎర్ర గంగిరెడ్డి
కోర్టులో లొంగని పక్షంలో ఆయన్ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకోవాలని
సూచించింది.ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు ఇచ్చిన గడువు దగ్గరపడుతుండగా.. ఎప్పుడు
లొంగిపోవాలనే విషయంపై తాజాగా ఎర్ర గంగిరెడ్డి మాట్లాడుతూ తన న్యాయవాదితో
చర్చిస్తున్నానని, లాయర్ సలహా మేరకు తాను కోర్టులో లొంగిపోతానని చెప్పారు. ఆ
ప్రకారమే నేడు హైదరాబాద్‌లో ఉన్న సీబీఐ కోర్టులో లొంగిపోయేందుకు ఎర్ర
గంగిరెడ్డి ఉదయం కోర్టుకు విచ్చేశారు. కోర్టులో లొంగిపోయిన ఎర్ర గంగిరెడ్డికి
సీబీఐ కోర్టు జూన్ 2వ తేదీ వరకు రిమాండ్ విధించింది.