అన్నదాతలు అధైర్యపడవద్దు..అండగా ఉంటాం
తేమశాతం 17 నుండి 20 వరకు సడలించాలని ఎఫ్ సి ఐ కి విజ్ఞప్తి చేశాం
20 శాతం తేమ ఉన్నా ధాన్యం కొనుగోలు చేసేలా మిల్లర్లతో మాట్లాడుతున్నాం
రాష్ట్రంలో దాదాపు 5వేల కోనుగోలు కేంద్రాల ద్వారా 1350 కోట్ల విలువగల
7.51లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం.
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
హైదరాబాద్ : వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అకాల వర్షం కురిసిందని, పంట
చేతికి అందే సమయంలో ఎప్పుడు అకాల వర్షాలు పడ్డా 10 నుండి 20 శాతం మాత్రమే పంట
నష్ట పోయేదని కాని మొదటి సారి వందకు వందశాతం పూర్తిగా పెట్టిన ప్రతీ పంట
నష్టపోయారని, అందుకే ప్రతీ ఎకరాన్ని పరిహారం నమోదు చేసేలా చర్యలు
తీసుకుంటామని, ధాన్యం కొనుగోలు ఎటువంటి ఆలస్యానికి తావు లేకుండా వేగవంతంగా
కొనుగోలు చేయడం జరుగుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి
గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్, దుర్షెడ్, గోపాల్
పూర్, గ్రామాలలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన పంటలను, కొనుగోలు
కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని మంత్రి గంగుల మంగళవారం పరిశీలించారు. ఈ
సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేతికి వచ్చిన పంట నెల పాలవడం బాధాకరం అని,
కొనుగోలు కేంద్రానికి వచ్చిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని అన్నారు. అకాల
వర్షానికి ఇప్పటికే పంట నష్టపోయిన వారికి ఎకరానికి 10 వేల రూపాయలు ఇవ్వాలని
ముఖ్యమంత్రి కెసిఆర్ గారు నిర్ణయించి ప్రకటించడం జరిగిందనీ అన్నారు. తడిసిన
ధాన్యాన్ని ఆరబెడితే తేమశాతం 20 వరకు వస్తె దానిని కొనుగోలు చేసి బాయిల్డ్
రైస్ మిల్లులకు పంపించాలని ఆదేశించడం జరిగిందని అన్నారు. కొనుగోలు కేంద్రానికి
రాకుండా పొలంలోనే పంట నష్టపోయిన వారికి ప్రభుత్వం పరిహారం చెల్లించి
ఆదుకుంటుందని, అన్నదాతలు అధైర్యపడవద్దని విజ్ఞప్తి చేశారు. వరుసగా కురుస్తున్న
వర్షాలతో ధాన్యం తొందరగా ఎండే పరిస్థితి లేకపోవడంతో తేమశాతం 17 నుండి 20 వరకు
సడలించాలని ఎఫ్ సి ఐ వారిని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడం
జరిగిందని అన్నారు. కరీంనగర్ జిల్లాతో పాటు ఎక్కడ బాయిల్డ్ రైస్ మిల్లులకు
అవసరం ఉంటాయో అక్కడికి తడిసిన ధాన్యాన్ని పంపించాలని ఆయ జిల్లాల కలెక్టర్లను
ఆదేశించడం జరిగిందని అన్నారు. అన్నదాతలను ఆదుకోవడమే మా అంతిమ లక్ష్యం అని
అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 5 వేల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం
జరిగిందని, సుమారు 7 లక్షల 51 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం
జరిగిందనీ అన్నారు. ఇప్పటికీ 1350 కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యం కొనుగోలు
చేయడం జరిగిందనీ, ఈ వారంలో కొనుగోలు వేగవంతం అవుతుందని అన్నారు. గతంలో ఏప్రిల్
నెలాఖరు వరకు 3 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఈ
సంవత్సరం 7 లక్షల 51 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందనీ
అన్నారు. ఎఫ్ సి ఐ కొనుగోలు కేంద్రాలను 15వ తేది నుండి ప్రారంభించాలని ఆదేశాలు
జారీ చేయగా, ముఖ్యమంత్రి కెసిఆర్ దానికంటే ఐదు రోజుల ముందే కొనుగోలు
కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించి ప్రారంభించడం జరిగిందని అన్నారు.
ముందస్తుగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం వలన కొంత మంది రైతులను
కాపాడగలిగామని అన్నారు.