పునర్నిర్మాణానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కరెంట్
కోతల నుంచి 24గంటల విద్యుత్ వరకు, నీటి గోస నుంచి నడి వేసవిలో మత్తడి
దూకుతున్న చెరువుల వరకు, బీళ్లు వారిన భూముల నుంచి పసిడి పంటల తెలంగాణ వరకు
సాగిన ప్రయాణమే రాష్ట్ర పునర్నిర్మాణానికి భాష్యమని తెలిపారు. సెక్రటేరియట్
కాంతులీనుతున్న తరహాలోనే తెలంగాణ వెలుగొందుతోందని కేసీఆర్ పేర్కొన్నారు.
రాజధాని నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన ఠీవీగా రాజసం ప్రదర్శిస్తున్న సమీకృత
సచివాలయ భవనం ప్రారంభమైంది. అత్యంత అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర పాలనా సౌధాన్ని ప్రారంభించారు.
అనంతరం సచివాలయ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మంత్రులు,
ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులను ఉద్దేశించి సీఎం కేసీఆర్
ప్రసంగించారు.
రాష్ట్రాభివృద్ధికి కృషి చేయడమే మా విధానం
తెలంగాణ పునర్నిర్మాణంపై కొందరు అవాకులు చెవాకులు పేలారని, తెలంగాణ మొత్తం
కూలగొట్టి కడతారా అని హేళన చేశారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. సమ్మిళిత
అభివృద్ధితో ప్రగతిఫతంలో సాగుతున్న తెలంగాణయే పునర్నిర్మాణానికి నిదర్శనమని
స్పష్టం చేశారు. మిషన్ కాకతీయతో చెరువుల రూపురేఖలు మార్చాంమని, మత్తడి
తొక్కుతున్న చెరువులే రాష్ట్ర పునర్నిర్మాణానికి తార్కాణమని తెలిపారు.
విమర్శలు పట్టించుకోకుండా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయడమే మా విధానమని స్పష్టం
చేశారు. వేసవిలో దేశవ్యాప్తంగా 96 లక్షల ఎకరాలు సాగైతే ఇందులో 54 లక్షల ఎకరాలు
మనవద్దే ఉన్నాయని తెలిపారు. తెలంగాణ పల్లెలు ఎన్నో అవార్డులు
సాధిస్తున్నాయన్నారు.